ఏపీ ప్రభుత్వానికి షాక్.. బిల్లు.. చట్టంగా మారక ముందు రాజధాని తరలించొద్దని హైకోర్టు హెచ్చరిక
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను వ్యతిరేకిస్తూ.. దాఖలైన అనేక పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లులు చట్టంగా మారకుండా రాజధాని తరలించవద్దని తేల్చి చెప్పింది. అలా చేస్తే, ప్రభుత్వం, అధికారులదే బాధ్యత అంటూ హెచ్చరించింది.
అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును వ్యతిరేకిస్తూ.. 30కి పైగా పిటిషన్లు దాఖలు కావడంతో.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో త్రిసభ్య బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్ పిటిషన్లపై విచారణ జరిపింది. విచారణ ప్రారంభమైన వెంటనే.. బిల్లుల గురించి న్యాయమూర్తి ఆరా తీశారు. ఏ స్థాయిలో ఉన్నాయని ప్రశ్నించారు. దీనికి అడ్వొకేట్ జనరల్ సమాధానమిస్తూ.. శాసనసభలో బిల్లు ఆమోదం పొందిందని.. శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపిందని అన్నారు. ఈ నేపథ్యంలో బిల్లు చట్టంగా మారడానికి సమయం ఉంది కాబట్టి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఈ సమయంలో రైతుల తరపు న్యాయవాది అశోక్ భాన్ వాదిస్తూ.. బిల్లు చట్టంగా మారకపోయినప్పటికీ ప్రభుత్వ ఆఫీసుల్ని తరలించాలని మౌఖిక ఆదేశాలు ఇస్తున్నరారని అన్నారు. అందుకే కార్యాలయాలు తరలించుకుండా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై స్పందిచిన న్యాయమూర్తి.. బిల్లుచట్టంగా మారకుండా కార్యాలయాలను తరలించకూడదన్నారు. అలా చేసినట్లు నిరూపణ అయితే.. ప్రభుత్వం, సంబంధిత అధికారుల్ని బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు. ఆ ఖర్చును బాధ్యుల వ్యక్తిగత ఖాతా నుంచి జమ చేయాల్సి ఉంటుందన్నారు.
ఇక, రైతులు తమ అభిప్రాయాలు తెలిపే సమయం ముగియకుండానే.. ప్రభుత్వం బిల్లు పెట్టిన విషయాన్ని రైతుల తరపున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. హైకోర్టు స్వయంగా సమయం ఇచ్చినా.. ఆ సమయం గడవక ముందే ఎందుకు బిల్లు పెట్టాల్సి వచ్చిందని అడ్వకేట్ జనరల్‌ను ధర్మానసం ప్రశ్నించింది.
ఓ దశలో ప్రభుత్వం చేపట్టిన బిల్లులు మనీ బిల్లులని అశోక్ భాన్ వాదించారు. దీనిపై స్పందించిన ఏజీ.. అవి మామూలు బిల్లులేనని.. ద్రవ్య బిల్లులు కాదని.. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి, బిల్లు చట్టంగా మారకపోయినా.. తరలింపు ప్రక్రియ ప్రారంభించాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. దీంతో మరో నెల రోజుల వరకు కూడా.. తరలింపునకు అవకాశం లేకుండా పోయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com