మండలిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన
అమరావతి విభజనకు సంబంధించి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడంపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సోమవారం స్పీకర్ అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టి మండలిని కొనసాగిద్దామా లేదా అనే విషయంపై చర్చిద్దామని స్పీకర్ ను అభ్యర్ధించారు. ఈ సందర్బంగా నిన్న మండలిలో జరిగిన పరిణామాలు ఎంతో బాధ కలిగించాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మండలి చట్టబద్ధంగా వ్యహరిస్తుందని నమ్మామని.. మాతో పాటు ప్రజల నమ్మకాన్ని మండలి వమ్ము చేసిందని అన్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం లేదని చైర్మనే చెప్పారని అన్నారు. చట్టాలు చేయడానికే ఈ అసెంబ్లీ ఏర్పాటైంది. మేము పాలకులం కాదు సేవకులం అన్నారు. మండలి చైర్మన్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలని నిన్న మండలిలో చైర్మన్ మాట్లాడిన మాటలను అసెంబ్లీలో వీడియో ప్రదర్శన రూపంలో ఇచ్చారు సీఎం జగన్. మండలి అనేది సలహాలు సూచనలు ఇవ్వడానికే ఉందన్న సీఎం.. బిల్లుల్ని అడ్డుకోవడానికి కాదని అన్నారు. మండలిలోని కాదు.. అసెంబ్లీలోను కూడా ఉన్నత వ్యక్తులు ఉన్నారని సీఎం అన్నారు..
మండలికోసం సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రానికి ఇది అవసరమా అని పేర్కొన్నారు. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండలిలు ఉన్నాయని.. ప్రజలకు మంచి చేయడం కోసం మండలి అనేది ఉండాలి కానీ.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రూల్స్ తో సంబంధం లేకుండా ఉండే మండలిని కొనసాగించడం అవసరమా? అని సీఎం అన్నారు. చైర్మన్ తప్పు చేస్తున్నాడని చెబుతూ.. అయినా నేను తప్పు చేస్తున్నానని చైర్మన్ అన్నారని అన్నారు. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదన్నారు. సీట్ అఫ్ గవర్నెన్స్ ను అడ్మినిస్ట్రేషన్ కోసం డిసెంట్రలైజషన్ చెయ్యడానికి క్యాపిటల్ అనేది అవసరం అన్నారు. హుద్దుద్ వచ్చినప్పుడు విశాఖలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా కూర్చొని పరిపాలన చెయ్యొచ్చన్న జగన్.. పరిపాలన చెయ్యడానికి ఏ చట్టం ఏ తీర్మానం అవసరం లేదు.. ఎక్కడైనా అసెంబ్లీ పెట్టొచ్చు చట్టాలు చెయ్యొచ్చని ఆర్టికల్ 174 చెబుతుందని అన్నారు. మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అన్న సీఎం.. ప్రభుత్వ బిల్లులను ఎలా అడ్డుకోవాలి అని వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. కాగా సీఎం ప్రసంగం అనంతరం స్పీకర్ అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com