ఈ మూడు రోజుల్లో వైసీపీ వ్యూహం ఫలించకపోతే.. జరిగేది అదేనా?

ఈ మూడు రోజుల్లో వైసీపీ వ్యూహం ఫలించకపోతే.. జరిగేది అదేనా?

మండలి రద్దు తప్పదా..? సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందా..? అసలు మూడు రోజుల సమయం సీఎం ఎందుకు తీసుకున్నారు..? ఈ మూడు రోజుల్లో ఎలాంటి వ్యూహంతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.. పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందా... ప్రస్తుతం ఈ ప్రశ్నలు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి.

శాసన మండలిలోని విపక్ష సభ్యులను తమవైపు మళ్లించుకునేందుకు వైసీపీ నేతలు కొద్దిరోజులుగా ప్రయత్నించినట్టు ప్రచారం జరుగుతోంది. అయినా పెద్దగా ఫలితం రాలేదు. మరికొందరిని ఆకర్షించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. ఈ మూడు రోజుల్లో తమ వ్యూహం ఫలించకపోతే, సోమవారం శాసన మండలిని రద్దు చేస్తున్నట్లు తీర్మానం ఆమోదించే అవకాశముందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ వెంటనే ఉభయ సభలను ప్రొరోగ్‌ చేసి మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు ఆర్డినెన్స్‌లను జారీ చేయించి సీఎం జగన్‌ తన పంతం నెగ్గించుకోవచ్చునని ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన.. ఇంగ్లీషు మీడియం, ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల బిల్లులను మండలి తిరస్కరించింది. అప్పటి నుంచే సీఎం జగన్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక.. రాజధానుల బిల్లుపై మండలి కేంద్రంగా సాగిన వ్యూహాలు అధికారపక్షానికి మరింత ఆగ్రహం తెప్పించాయి. టీడీపీ అకస్మాత్తుగా రూల్‌ 71ను తీసుకొచ్చి ప్రభుత్వ విధానంపై అవిశ్వాసం ప్రకటించడంతో సర్కార్‌ షాక్‌కు గురైనట్టు సమాచారం.

మండలిలో చైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించేంత వరకూ.. అధికార పక్షానికి రూల్‌ 71 గురించి సమాచారం అందలేదు. దీంతో.. అసెంబ్లీ సెక్రటేరియట్‌, శాసనసభా వ్యవహారాలు చూస్తున్న ముఖ్య నాయకులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక.. సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్‌ తీసుకున్న నిర్ణయంతో సీఎం జగన్‌ ఇంకాస్త సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది.

నిజంగానే మండలిని ఏపీ ప్రభుత్వం రద్దు చేయాలి అనుకుంటే.. మొదట అసెంబ్లీలో తీర్మానం చేయాలి.. తరువాత తుది నిర్ణయం మాత్రం కేంద్రం చేతిలోనే ఉంటుంది. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాలి. ఆ తర్వాత మండలి రద్దుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. చివరగా.. రాష్ట్రపతి సంతకంతో మండలి అధికారికంగా రద్దవుతుంది. ఇదంతా ఎన్నాళ్లలోపు పూర్తవుతుందో చెప్పలేం. కేంద్రం ఎంత వేగంగా స్పందిస్తుంది, ఎంతగా సహకరిస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story