ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ అంటే లెక్కేలేదు : చంద్రబాబు

ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ అంటే లెక్కేలేదు : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్‌ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు. సభలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండా చేశారని ఆరోపించారు. మండలిలో కరెంట్ కట్ చేసి, లైవ్ ప్రసారాలను నిలిపివేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని నిలదీశారు..ఈ ప్రభుత్వానికి మండలి ఛైర్మన్ అంటే కనీస గౌరవం లేదన్నారు. ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ అంటే లెక్కేలేదని ఆరోపించారు. ఏబీఎన్‌, టీవీ5, ఈటీవీ ప్రసారాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని ఫైర్ అయ్యారు చంద్రబాబు.

మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. మంత్రులు గుండాలు, బజారు రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తుంటే సరెండర్ అవ్వాలా అని ప్రశ్నించారు.. నోటితో చెప్పలేని బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో ఎక్కడా 3 రాజధానులు లేవని అన్నారు చంద్రబాబు . జగన్‌ ఒక్కడికే బుర్ర ఉన్నట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 86 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి కరుడుగట్టిన క్రిమినల్స్‌ని పెట్టుకుని.. జగన్‌ రాష్ట్రాన్ని అపహాస్యం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

శాసన మండలిని రద్దు చేసే అధికారం సీఎం జగన్‌కు లేదన్నారు చంద్రబాబు. తీర్మానం చేస్తే కేంద్రం కూడా అంగీకరించదని, సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం చెప్పే వరకు మండలిని రద్దు చేయడం కుదరదని అన్నారు.

శాసన మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు చంద్రబాబు. మంత్రులు, వైసీపీ సభ్యుల తీరును ఆయనకు వివరించారు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ఆధ్వర్యంలో గవర్నర్‌ వద్దకు వెళ్లిన టీడీపీ బృందం ఒక మెమొరాండం సమర్పించింది..

మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల ధైర్యం, తెగువను ప్రశంసించారు చంద్రబాబు నాయుడు. భయపెట్టినా, ప్రలోభపెట్టినా లొంగకుండా వాళ్లు చూపిన చొరవ చరిత్రలో నిలిచిపోతుందని, ఎమ్మెల్సీలను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story