కివీస్ ఆశలపై నీళ్లు చల్లిన టీ20 స్పెషలిస్ట్

కివీస్ ఆశలపై నీళ్లు చల్లిన టీ20 స్పెషలిస్ట్

కివీస్ పర్యటనను మనవాళ్లు విక్టరీతో మొదలు పెట్టారు. ఆక్లాండ్ వేదకగా జరిగిన తొలి టీట్వంటీలో కోహ్లీ సేన రెచ్చిపోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు.

అటు రాహుల్ కలిసి కెప్టెన్ కోహ్లీ సైతం స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ తో 45 పరుగులు చేశాడు.

కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత బరిలోకి దిగిన టీట్వంటీ స్పెషలిస్ట్ శ్రేయాస్ అయ్యర్.. అంచనాలు వదిలేసుకున్న మ్యాచ్ ను విజేతగా నిలిపాడు. గెలుపు తమదే అనుకున్న కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు మూడు సిక్సర్లతో 58 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ నాటౌట్ గా నిలిచాడు. ఇక, చివర్లో శివమ్ దూబే 13 పరుగులు, మనీష్ పాండే 14 పరుగులు చేశారు.

మొత్తానికి, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వీరబాదుడుతో ఒక ఓవర్ మిగిలివుండగానే.. 204 పరుగుల టార్గెట్ ను పూర్తిచేసిన టీమిండియా జయకేతనం ఎగురవేసింది.

అంతకుముందు, టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్.. భారత్ ముందు భారీ టార్గెట్ వుంచింది. ఓపెనర్ కొలిన మన్రో, కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో.. కివీస్ 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.

టీమిండియా బౌలర్లలో బుమ్రా, ఠాకూర్, చాహాల్, దూబే, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో భారీగా పరుగులిచ్చిన మహ్మద్ షమీకి వికెట్ దక్కలేదు.

మొత్తానికి, భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోహ్లీ సేన.. తొలి మ్యాచ్ లోనే బోణీ కొట్టింది. అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన శ్రేయాస్ అయ్యర్‌ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు

ఈ విజయంతో.. 5 టీట్వంటీల సిరీస్ లో కోహ్లీ సేన ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఇదే మైదానంలో జనవరి 26న జరుగనుంది.

Tags

Read MoreRead Less
Next Story