ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేశాం.. అద్భుత ఫలితాలు వచ్చాయి: కేసీఆర్

ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేశాం.. అద్భుత ఫలితాలు వచ్చాయి: కేసీఆర్

మున్సిపల్ ఎన్నికల విజయం తమ ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందన్నారు సీఎం కేసీఆర్. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పారు. ఈ గెలుపు అంత ఈజీగా రాలేదని.. ఎన్నికలను ఓ గేమ్‌లా కాకుండా టాస్క్‌లా తీసుకొని రాత్రింబవళ్లు కష్టపడ్డామని చెప్పారు. ఒళ్లు వంచి పనిచేశాం కాబట్టే గతంలో ఎప్పుడూ లేనటువంటి అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. అయితే నేతలు, కార్యకర్తలు గర్వం, అహాంకారన్ని దరిచేయనీయొద్దని హితవు పలికారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు... విజయం కోసం కృషి చేసిన పార్టీ వర్గాలకు అభినందనలు తెలిపారు కేసీఆర్. ఎక్స్‌అఫిషియో ఓట్లను కలుపుకుంటే 115- 120 మధ్యలో మున్సిపాల్టీలను గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 80 లక్షలకు మించి ఖర్చు చేయలేదని.. అందరికీ పార్టీ మెటీరియల్ మాత్రమే పంపినట్లు చెప్పారు.

ప్రతిపక్షాల తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్. ప్రజలు అమ్ముడుపోయారని అవాకులు చవాకులు పేలారంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలను ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేశారన్నారు. విపక్షాలు హుందాగా వ్యవహరించాలన్న కేసీఆర్.. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కేంద్రం తీరుపైనా విమర్శలు గుప్పించారు కేసీఆర్. రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. కేంద్రంమాటలు కోటలు దాటుతుంటే.. చేతలు మాత్రం మరోలా ఉన్నాయని అన్నారు. అటు ఇటీవల తెలంగాణ గ్రోత్ రేటు కూడా పడిపోయిందన్నారు. అందుకే డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేయాలని అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు. ఇబ్బందులున్నా పీఆర్సీ, ఉద్యోగుల వయోపరిమితి పెంపు వంటి హామీలను అమలు చేస్తామన్నారు. మార్చి1 నుంచి 57 ఏళ్లుదాటిన వాళ్లందరికీ ఫించను ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. పల్లెప్రగతి మాదిరిగానే.. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా త్వరలో అమలు చేస్తామన్నారు.

కొత్త రెవిన్యూ చట్టం, పంచాయతీ రాజ్ చట్టాన్ని అత్యంత కఠినంగా అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. రెవిన్యూ ఉద్యోగుల తీరుపై విమర్శలు గుప్పించారు. రెవిన్యూ డిపార్ట్ మెంట్ ఎందుకు అంతగా అప్రతిష్టపాలవుతుందో ఉద్యోగులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. అంతేకాని సంఘాలున్నాయి కదా అని ఎగిరెగిరిపడితే కుదరదని హెచ్చరించారు. రెవిన్యూ శాఖ అవినీతిలో నెంబర్‌1గా ఉన్నట్లు నివేదికల్లో వెల్లడైందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story