90 శాతం ఫలితాలను సాధించిన ఏకైక పార్టీగా టీఆర్ఎస్ రికార్డు

90 శాతం ఫలితాలను సాధించిన ఏకైక పార్టీగా టీఆర్ఎస్ రికార్డు

పార్లమెంట్ ఎన్నికలను మినహాయిస్తే.. వరుసగా అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో 90 శాతం ఫలితాలను సాధించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ రికార్డు సృష్టించింది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కడక్కడా కొంత ఆధిక్యం ప్రదర్శించినా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో దాదాపు వన్ సైడ్ షో చేసింది టీఆర్ఎస్.

మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం ఛైర్మన్స్ స్థానాలను ఒక పార్టీ గెలుచుకోవడం దేశంలోనే అరుదైన విషయమంని రాజకీయ నిపుణులు అంచనావేస్తున్నారు. దేశ చరిత్రలో ఈ ఫీట్ ఏ జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి సాధ్యపడలేదని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం దక్కడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలోని కీలక స్థానాలైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో తాజా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టబోతున్నామని ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు గట్టిగానే ప్రచారం చేశారు. కానీ. క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. ఆ మూడు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. తద్వారా తమకు పోటీయే లేదని టీఆర్ఎస్ నిరూపించింది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మూడు జిల్లాల పరిధిలో ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. టీఆర్ఎస్ మొత్తం 109 మున్సిపాలిటీల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ 5, బీజేపీ ఒకచోట మాత్రమే విజయం సాధించాయి.

120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ 107 చోట్ నేరుగా విజయం సాధించగా.. ఐజా, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున టీఆర్ఎస్ రెబల్సే గెలిచారు. వీటిని కూడా కలుపుకుంటే 109 పురపాలికల్లో గులాబీ జెండా ఎగిరింది. ఇక, టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం భైంసా, జల్పల్లిలో గెలుపొందగా.. ఆమన్ గల్, తక్కుగూడ, మక్తల్ మున్సిపాలిటీలు బీజేపీ వశమయ్యాయి.

ఇక, కాంగ్రెస్ పార్టీ నాలుగు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. పెద్ద అంబర్ పేట, తుర్కయాంజిల్, వడ్డేపల్లి, నారాయణఖేడ్ హస్తం పార్టీ విజయం సాధించగా.. అమరచింత, దుబ్బాకలో ఎక్కువ స్థానాలు సాధించిన ఇండిపెండెంట్లు కీలకంగా మారారు.

మొత్తానికి తెలంగాణ పురపోరులో వార్ వన్ సైడ్ అయిందనే చెప్పాలి. చాలాచోట్ల కాంగ్రెస్, బీజేపీ కంటే టీఆర్ఎస్ రెబల్సే గట్టి ప్రభావం చూపించారు. దాదాపు 25 నుంచి 30 మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భావించినప్పటికీ.. అలాంటి పరిస్థితి మాత్రం కనిపించలేదు.

తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ తీవ్రంగా డీలా పడిపోయింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా అగ్ర నేతల ఇలాఖాల్లోనూ టీఆర్ఎస్ పాగా వేసింది. దీంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ప్రస్తుతం వెలవెలబోతోంది.

Tags

Read MoreRead Less
Next Story