మండలికి మంగళమేనా...? రద్దు అవ్వడం తప్పదా..?

మండలికి మంగళమేనా...? రద్దు అవ్వడం తప్పదా..?

మండలికి మంగళమేనా...? రద్దు అవ్వడం తప్పదా..? శాసనమండలి రద్దు కథ దాదాపు క్లైమాక్స్‌కు చేరినట్దిటేనా..? శాసనమండలిని ప్రభుత్వం రద్దు చేస్తుందా..? లేక యథాతథంగా కొనసాగిస్తాందా..? వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయా..? అసెంబ్లీలో ప్రభుత్వ ప్రకటన ఎలా ఉండబోతోంది..? ఈ ప్రశ్నలన్నింటీకీ మరికొన్ని గంటల్లోనే సమాధానం దొరకనుంది. ప్రభుత్వం మాత్రం రద్దుదిశగా తీర్మానం చేస్తుందని చర్చ జరుగుతోంది. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా.. రాష్ట్ర శాసన మండలి విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు 99 శాతం మేర మండలిని రద్దు చేసే దిశలోనే సీఎం జగన్‌ ఉన్నారని తెలుస్తోంది.

సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లెజిస్లేటివ్‌ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్‌ రాజధాని, జ్యుడీషియల్‌ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తరువాత చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అయితే శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేబినెట్‌ భేటీ తరువాత ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో.. మంత్రి మండలి తీసుకున్న నిర్ణాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.

ఒకవేళ శాసనమండలి రద్దుకే మొగ్గు చూపితే అది వైసీపీకే ఎక్కువ నష్టమని విపక్షాలు వాదిస్తున్నాయి. మరో ఏడాది తరువాత శాసనమండలిలో ప్రస్తుతం ఉన్న సభ్యులలో ఎక్కువంది రిటైర్‌ అవుతారు. 2021, 2023 లలో టీడీపీ సభ్యులు ఒక్కొక్కరుగా రిటైర్‌ అవుతుంటే.. ఆ స్థానాల్లో వైసీపీ సభ్యులు భర్తీ అవుతారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి పార్టీ ముఖ్యనేతలు వివరిస్తున్నారు. శాసనమండలి రద్దయితే పార్టీకి అత్యంత విశ్వసనీయంగా ఉండే మంత్రులు పిల్లి సుభాశ్‌చంద్రబోస్‌.. మోపిదేవి వెంకటరమణారావు వంటివారు తమ ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోతారు. వారి కోసం ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ స్థానాలు ఖాళీచేసి, ఆరునెలల్లో వాటికి ఎన్నికలు జరిగితేనే వారు మంత్రివర్గంలో కొనసాగే వీలుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story