ఆ రెండు సినిమాలు చూసి నవ్వుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశమైంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలతో చర్చించారు చంద్రబాబు. మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో చర్చ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని నేతలు అభిప్రాయపడ్డారు. అందుకే ఇవాళ అసెంబ్లీకి హాజరు కావొద్దని నిర్ణయించారు.
కష్టకాలంలో అండగా ఉన్నవారిని పార్టీ గుర్తిస్తుందని.. అధికార పార్టీ ప్రలోభాలకు ఎవరూ ఆకర్షితులు కావొద్దని చంద్రబాబు నేతలకు సూచించారు. అధికార పార్టీ ప్రలోభాలకు తలవంచక పోవడం వల్లే మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆరోపించారు..
టీడీఎల్పీ సమావేశంలో రెండు సినిమా సన్నివేశాలను చూపించారు సభ్యులు. ప్రభుత్వ నిర్ణయాలను పోలుస్తూ వీడియోలు ప్రదర్శించారు. ఢిల్లీ నుంచి దౌల్తాబాద్‌కు రాజధానిని మార్చిన మహ్మద్ బీన్ తుగ్లక్ సినిమాతోపాటు ప్రజలను హింసించే 23వ రాజు పులికేసి సినిమా క్లిప్పింగులను ప్రదర్శించారు.. సినిమా సన్నివేశాలను చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవ్వుకున్నారు.. రాష్ట్రంలో పరిపాలన ఇదే విధంగా ఉందంటూ అభిప్రాయపడ్డారు.
మండలిలో టీడీపీకి 32 మంది ఎమ్మెల్సీలుండగా సమావేశానికి 23 మంది హాజరయ్యారు. అయితే సమావేశానికి రాలేమంటూ..ఐదుగురు ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ ముందుగానే సమాచారమిచ్చారు. అటు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలతో కొందరు మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని, డబ్బు, పదవులు ఎర వేస్తున్నారని టీడీపీ ఆరోపించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com