9 నెలల్లో ఏపీని సర్వనాశనం చేశారు: చంద్రబాబు

9 నెలల్లో ఏపీని సర్వనాశనం చేశారు: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో శాసన మండలి రద్దు తీర్మానం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దు తీర్మానం విచారకరమన్నారు. 3 రాజధానుల అంశాన్ని మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారనే అక్కసుతో మండలి రద్దుపై తీర్మానం చేశారని ఆరోపించారు. ఉన్నత ఆశయాలతో ఏర్పడిన మండలిని రద్దు చేయడం సరికాదన్నారు చంద్రబాబు.

మండలిని రద్దు చేసే అధికారం అసెంబ్లీకి లేదని.. తీర్మానం చేసే అధికారం మాత్రమే ఉందన్నారు చంద్రబాబు. మండలికి జగన్‌ ప్రభుత్వం రాజకీయాలు ఆపాదించిందని.. మండలిలో టీడీపీ చేసిన తప్పేంటని నిలదీశారు. ఇప్పటికైనా మండలి రద్దును పునసమీక్షించుకోవాలని కోరారు.

మండలికి ఏడాదికి 60 కోట్లు ఖర్చు అవుతున్నాయంటూ సాకులు చెబుతున్న జగన్‌.. కోర్టులకు వెళ్లేందుకు 30కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తన తరపున వాదించడానికి జగన్ అడ్వకేటుకు 5 కోట్లు ఇవ్వలేదా అని గుర్తు చేశారు.

మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పే జగన్‌కు.. ఎమ్మెల్యేల కేసులపై సమాధానం చెప్పే ధైర్యముందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. చివరికి తీర్మానంపై ఓటింగ్‌ సమయంలోనూ నాటకం ఆడారని ఆరోపించారు. సభలో 121 మంది ఉన్నారని చెప్పి.. ఆఖరికి 133 మంది ఉన్నారని ప్రకటించడమేంటని నిలదీశారు.

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ ప్రయత్నించిందని చంద్రబాబు ఆరోపించారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం కోసం అన్ని ప్రయత్నాలూ చేశారని.. 22 మంది మంత్రులు మండలిలో ఉండి ఎన్ని అడ్డదారులు తొక్కాలో తొక్కారని విమర్శించారు. ప్రలోభాలకు లొంగకుండా ఉన్న తమ ఎమ్మెల్సీలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.

టీడీపీలో తరపున శాసనమండలిలో 30 మంది ఉంటే.. అందులో 20 మంది బడుగు బలహీన వర్గాల వారే అన్నారు టీడీపీ అధినేత. తనపై విమర్శలు చేసే హక్కు జగన్‌కు లేదన్నారు. 9 నెలల్లో ఏపీని సర్వనాశనం చేశారని.. దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story