ఉత్కంఠ రేపుతున్న నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బలాలు సరిసమానంగా ఉన్నాయి. ఇద్దరికీ చెరో 10 ఓట్లు ఉండటంతో లాటరీ ద్వారా ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు.. అటు కేవీపీ ఓటు విషయంలో వివాదం చెలరేగడంతో కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. కలెక్టర్‌ను మరో జిల్లాకు బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఇదే వ్యవహారంలో నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మరోవైపు ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా నేరేడుచర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. 600 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు.
కేటీఆర్ ఎన్నికల అక్రమాలకు నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలనే నిదర్శనమన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈనెల 25వ తేదీ వరకే ఎక్స్ అఫిషియో సభ్యుల నమోదు జరగాలని నిబంధనలు ఉన్నాయని.. కానీ, ఈరోజు మున్సిపల్ సభ్యులుగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి పేరు నమోదు చేయిస్తున్నారని ఫైరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని.. అలాంటప్పుడు ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. కేటీఆర్ ఇంట్లో కూర్చొని రాసుకుంటే సరిపోతుంది కదా అని ఎద్దేవా చేశారు. సోమవారం నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను ప్రారంభించినా ఎమ్మెల్యే గొడవ చేసి వాయిదా వేయించారని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా సభ్యులను నమోదు చేయిస్తున్నారని.. ఇది ఎన్నికల అక్రమాలకు పరాకాష్ట అని ఉత్తమ్ అన్నారు. ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, ప్రజలు గమనించాలని.. అర్థం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com