బీజేపీ-జనసేన సమన్వయ భేటీలో కీలక నిర్ణయాలు

బీజేపీ-జనసేన సమన్వయ భేటీలో కీలక నిర్ణయాలు

కలిసి నడవడంపై బీజేపీ-జనసేన కసరత్తు ప్రారంభించాయి. విజయవాడలో రెండు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంతారెడ్డి హాజరయ్యారు. జనసేన పక్షాన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శివశంకర్, గంగులయ్య, మధుసూదన్‌ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి, నాయకర్, శ్రీనివాస్ యాదవ్‌ పాల్గొన్నారు. బీజేపీ-జనసేన నాయకుల సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అమరావతికి భూములు త్యాగం చేసి, రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులను కలవాలని బీజేపీ-జనసేన నేతలు నిర్ణయించారు. కలిసి వెళ్లి.. వాళ్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వనున్నారు. అమరావతే రాజధానిగా ఉంచాలంటూ ఉభయ పక్షాలు డిమాండ్ చేశాయి. అందుకోసం ఉద్యమించాలని నిర్ణయించారు. రాజధాని మార్పుపై పోరాటం, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడంపై నేతలు ప్రధానంగా దృష్టి సారించారు. మూడు రాజధానుల నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసని, ఆశీస్సులు ఉన్నాయంటూ వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కమిటీలు నియమించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఉభయ పార్టీల అధ్యక్షులు ఆమోదం తెలిపిన తర్వాత.. ఆ కమిటీలు ముందుకెళ్తాయి. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే.. భవిష్యత్‌లో మరింత ఉత్సాహంతో పనిచేయవచ్చని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story