విశాఖ ఎయిర్‌పోర్టులో కరోనా వైరస్‌ అలర్ట్‌

విశాఖ ఎయిర్‌పోర్టులో కరోనా వైరస్‌ అలర్ట్‌

కరోనా వైరస్‌ హైదరాబాద్‌ను వణికిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుండటంతో.. అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు అనుమానిత కేసులతో హైదరాబాద్‌ ఉలిక్కి పడింది. అయితే, ఆ నలుగురిలో ఇద్దరి రక్తనమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది.

మరోవైపు ఈ ప్రమాదకరమైన కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాధి గ్రస్తులను గుర్తించకపోయినా.. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే, వెంటనే చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ముఖ్యంగా గాంధీ, చెస్ట్‌ ఆసుపత్రుల్లో ఒక్కోదాంట్లో 8 పడకల చొప్పున వెంటిలేటర్లు, ఇతర అధునాతన పరికరాలతో కూడిన ఐసీయూలను అందుబాటులో ఉంచారు.

ఇక, కరోనా వైరస్ బాధితుల చికిత్స, నమూనాల సేకరణ, పుణెకు పంపించడం, ఫలితాలు ఎప్పటికప్పుడూ తెలుసుకోవడం, అవసరమైన ఇతర ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని కూడా వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వైద్య ఉన్నతాధికారులతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.

చైనా, హాంకాంగ్ తదితర దేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారిలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే.. కరోనా వైరస్ వచ్చిందనే భయంతో ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. సాధారణ ఫ్లూ లక్షణాలుంటే.. వారిలో కరోనా పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ లక్షణాలు కావచ్చేమోననే అనుమానిస్తే మాత్రం.. వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాలని కేంద్ర అధికారులు సూచించారు.

కరోనా వ్యాప్తిపై అనుమానాలు ముసుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. ఈ బృందంలో ఏడు రాష్ట్రాలకు చెందిన 35 మంది డాక్టర్లున్నారు. గాంధీ, ఫీవర్‌, చెస్ట్ ఆస్పత్రులను ఈ టీం పర్యవేక్షిస్తోంది. ఆస్పత్రుల్లోని ఐసోలేటెడ్ వార్డులను పరిశీలిస్తోంది.

అటు కరోనా నివారణ చర్యలల్లో భాగంగా కేంద్రం అన్ని ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించింది. కోరోనా వైరస్ వ్యాపిస్తున్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందుకోసం థర్మల్‌ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అనుమానం వస్తే.. ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహించి.. వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తర్వాతే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులోనూ థర్మల్ స్క్రీనింగ్‌ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ను కేంద్రం నుంచి వచ్చిన వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా ఈ బృందం అవగాహన కల్పిస్తోంది.

విశాఖ ఎయిర్‌పోర్టులోనూ కరోనా అలర్ట్‌ కొనసాగుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు థర్మల్ స్క్రీనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల్లో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే నగరంలోకి అనుమతిస్తున్నామని.. విశాఖ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కిషోర్ తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని.. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Tags

Next Story