విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటికే 106 మంది మృతి

విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటికే 106 మంది మృతి

మహమ్మారిలా విరుచుకుపడుతున్న కరోనా ధాటికి చైనా విలవిల్లాడిపోతోంది. ఎన్ని చర్యలు చేపట్టినా రోజుకు పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా వైరస్‌ తో ఇప్పటివరకు 106 మంది చనిపోయారు. ఇన్నాళ్లు వుహాన్ లోనే నమోదైన మరణాలు తాజాగా చైనా రాజధాని బీజింగ్‌ కు కూడా పాకడం కలవర పెడుతోంది. కరోనా వైరస్‌ తో బీజింగ్ లో ఓ వ్యక్తి మరణించాడు. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ ప్రకటించింది. వైరస్ సోకిన వారి సంఖ్య నాలుగు వేలు దాటిపోయింది. మరోవైపు ప్రపంచదేశాలకూ ఈ వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతోంది. జర్మనీ, శ్రీలంకలో కూడా తొలి కేసు నమోదైంది. దీంతో ఆయా దేశాల్లో చైనా నుంచి వచ్చిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.

కరోనా వైరస్ దేశంలోకి వ్యాప్తి కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వారిని పరీక్షించేందుకు ప్రస్తుతం 7 విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కొనసాగుతోందన్నారు. ఆ సదుపాయాన్ని ఇంకా 20 విమానాశ్రయాలకూ విస్తరిస్తామని చెప్పారు. అనుమానితుల నమూనాలను ప్రస్తుతం పుణెలో ఉన్న ఎన్ఐవీ లేబొరేటరీలో పరీక్షిస్తున్నారు. ఇకనుంచి లేబొరేటరీని అలెప్పీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబయిల్లోనూ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు విమానాశ్రయాల దగ్గర తనఖీలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం దేశంలోని ఏడు ఎయిర్‌ పోర్టులలో థర్మల్‌ స్క్రీనింగ్ చేపడుతున్నారు. ఇప్పటివరకు 35వేల మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేసినట్లు కేంద్రం తెలిపింది. అనుమానితులైన 20 మంది నమూనాల్నిపరీక్షలకు పంపగా.. నెగెటివ్ గానే తేలిందన్నారు. మరోవైపు చైనాలో ఉన్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. జనవరి 1, 2020 తర్వాత చైనా పర్యటనకు వెళ్లిన వారు..ఏవైనా జ్వరం, జలుబు లక్షణాలు ఉంటే సత్వరమే వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కేంద్రం సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story