బేర్‌గ్రిల్స్‌ తో సాహసం ముగిసింది.. బ్యాక్‌ టు చెన్నై

బేర్‌గ్రిల్స్‌ తో సాహసం ముగిసింది.. బ్యాక్‌ టు చెన్నై

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌ కూడా వరల్డ్ ఫేమస్. వీళ్లిద్దరూ ఇప్పుడు జత కలిశారు. రియాల్టీ షో కోసం వాళ్లిద్దరూ రంగంలోకి దిగారు. దట్ట మైన కీకారణ్యంలో వారిద్దరూ ప్రయాణిస్తున్నారు. సింహాలు, పులులు తదితర క్రూర జంతువులు, విష కీటకాలు, భయంకరమైన సర్పాల మధ్య సంచరించారు.

మ్యాన్ వర్సెస్ వైల్డ్... డిస్కవరీ ఛానెల్‌లో వచ్చే ఈ షో చాలా ఫేమస్. ఆ ప్రోగ్రామ్‌ను నడిపించే బేర్ గ్రిల్స్‌కి కూడా లక్షలమంది ఫ్యాన్స్ ఉన్నారు. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్గ్‌తో ఈ షోని నడిపిస్తుంటాడు. ఆ కార్యక్రమంలోనే రజనీకాంత్ పాల్గొన్నారు. బేర్ గ్రిల్స్‌ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ షూటింగ్‌లో తలైవా కూడా పార్టిసిపేట్ చేశారు. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో షూటింగ్ జరిగింది. అయితే..డాక్యుమెంటరీ షూటింగ్ సమయంలో రజనీకాంత్ స్వల్ప గాయాలయ్యాయి. భుజంపై చెట్టు కొమ్మలు గీసుకుపోయాయి. ఈ గాయం కారణంగానే రజనీ షూటింగ్ నుంచి చెన్నై బయల్దేరినట్లు ప్రచారం జరిగింది. అయితే..రజనీకాంత్ మాత్రం తనకేమి పెద్ద గాయాలు కాలేదని క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాతే చెన్నై వచ్చినట్లు వివరించారు.

బందీపూర్ వైల్డ్ లైఫ్ పార్క్, ప్రకృతి సంరక్షణపై రజనీ, బేర్ గ్రిల్స్‌ మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకుంటూ డాక్యుమెంటరీ చేయాల్సి ఉంది. రెండు రోజుల పాటు ప్రోగ్రామ్‌ షూట్ అని ప్లాన్ చేసుకున్నారు. నాలుగు లొకేషన్లలో షూటింగ్‌కు పర్మిషన్ తీసుకున్నారు. ఈ షూటింగ్ కోసం కబాలీ ప్రస్తుతం బందీపూర్ రిసార్ట్‌లోనే మకాం వేశారు. అయితే..గాయం తర్వాత వెంటనే ఆయన చెన్నై చేరుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా గతంలో మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఆ సాహసయాత్ర సాగింది. బెంగాల్‌ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో మోదీకి గ్రిల్స్‌ వివరించారు. ఈ సందర్భంగా తన బాల్యం, ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయ జీవితంపై ఆసక్తికర అంశాలను ప్రధాని పంచుకున్నారు. ప్రకృతితో మమేక మై ఎలా జీవించాలో వివరించారు. పులుల అడుగుజాడల్ని చూసుకుంటూ వారిద్దరూ ఓ నదిని తెప్పపై దాటారు. ఈ సాహస యాత్ర ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది.

మోదీ తర్వాత మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో పాల్గొన్న వ్యక్తిగా రజనీకాంత్ అరుదైన ఘనత అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న తలైవా, బేర్ గ్రిల్స్‌తో ఎలాంటి సాహసాలు చేశారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. రజనీకాంత్ తర్వాత బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌పై ఈ వైల్డ్ డాక్యుమెంటరీని చిత్రీకరిస్తారని సమాచారం.

Tags

Next Story