30 Jan 2020 8:35 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / కరోనా వైరస్ ప్రభావంపై...

కరోనా వైరస్ ప్రభావంపై తాజా సమాచారం

కరోనా వైరస్ ప్రభావంపై తాజా సమాచారం
X

కరోనా వైరస్ రోజురోజుకీ పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంటోంది. ఇప్పటికే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 132కి చేరింది. మరో 6 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరిలో 12 వందల 39 మంది పరస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ అంటువ్యాధికి కేంద్రంగా మారిన వుహాన్ నగరంలోనే ఇప్పటి వరకు 125 మంది ప్రాణాలు విడిచారు. మరో 3 వేల 554 మంది వైరస్ తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న హుబెయ్ ప్రావిన్సులో 840 కొత్త కేసులు నమోదయ్యాయి.

చైనాలోని కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకూ తాకింది. వుహాన్ నగరంలో తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లు చిక్కుకుపోయారు. క్యాంపస్‌ నియామకాల ద్వారా శ్రీసిటీలోని టీసీఎల్ కంపెనీకి ఎంపికైన వీరంతా..శిక్షణ నిమిత్తం వుహాన్ కు వెళ్లారు. సదరు సంస్థ మొత్తం 96 మందిని 3 నెలల శిక్షణకోసం చైనాకు పంపించింది. ఆగస్టు 2019లో చైనా వెళ్లిన వారిలో 38 మంది నవంబర్ లోనే తిరిగివచ్చారు. మిగిలిన 58 మంది వుహాన్ లోని కంపెనీ హాస్టల్ లోనే ఉండిపోయారు. కరోనా వైరస్ ప్రబలిన తరుణంలో స్వస్థలాలకు చేరుద్దామని సంస్థ ప్రయత్నించినప్పటికీ అప్పటికే నిషేధం అమల్లోకి రావడంతో నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. వారిని ఎలాగైనా భారత్ కు రప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.

వుహాన్ నగరంలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ఉద్యోగుల్లో .. తిరుపతికి చెందిన విష్ణుప్రియ కూడా వుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తన కుమార్తెను సురక్షితంగా భారత్ కు తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు విష్ణుప్రియ తండ్రి సుబ్రహ్మణ్యం. తన కుమార్తెతో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నానని.. అయితే, వుహాన్ నగరంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం పట్ల ఆందోళన చెందుతున్నానని అన్నారు. తన కుమార్తెతో పాటు మిగతా తెలుగు ఇంజినీర్లను రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచమంతా కోరలు చాస్తోంది. ఇక ఈ రాకాసి మొదట పంజా విసిరిన చైనా నగరం వుహాన్ అయితే బాహ్య ప్రపంచం నుంచి సంబంధాలు లేకుండా నిషేధిత నగరంలా మారింది. ఇక అక్కడ ఉన్న భారతీయుల కష్టాలు అన్ని ఇన్ని కావు. నగరంలో ఇంచుమించు కర్ఫ్యూ వాతావరణంలో ఉన్నామని వారు వాపోతున్నారు.

తమను వీలైనంత త్వరగా రక్షించాలంటూ వుహాన్ లో ఉన్న భారతీయ విద్యార్థులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా ఇక్కడి భారతీయ రాయబార కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటూ సహాయం చేస్తోందని తెలిపారు. వుహాన్ లోని భారతీయ విద్యార్థుల్లో అసోం, దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ , జమ్ము-కశ్మీర్ లకు చెందినవారు అధికంగా ఉన్నారు. కాగా ప్రత్యేక ఎయిరిండియా విమానం ద్వారా వుహాన్ నుంచి భారతీయ పౌరులను తరలించేందుకు డైరక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతించింది.

అటు.. మరో పది రోజుల్లో ఈ వైరస్ తీవ్రరూపం దాల్చి మృతులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య రంగ నిపుణుడు ఝోంగ్ నాన్ షన్ హెచ్చరించారు. బాధితుల్ని వీలైనంత త్వరగా గుర్తించి వారిని దూరంగా ఉంచడమే ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక మార్గమని అన్నారు. జ్వరం, బలహీనంగా మారడమే వైరస్ సోకిన వారిలో కనిపిస్తున్న ప్రముఖ లక్షణాలని తెలిపారు. ఏమాత్రం అనుమానం ఉన్నా.. వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు.

Next Story