ఏ మాత్రం నిరాశ లేదు.. రాజధాని ఆశలు అలాగే సజీవంగా

ఏ మాత్రం నిరాశ లేదు.. రాజధాని ఆశలు అలాగే సజీవంగా

అమరావతి ఉద్యమం 44వ రోజుకు చేరింది. ఏ మాత్రం నిరాశ లేదు.. రాజధాని ఆశలు అలాగే సజీవంగా ఉన్నాయి. అమరావతి తరలింపును అడ్డుకుంటాం.. రాజధానిని కాపాడుకుని తీరతామంటూ రైతులు రణనినాదం చేస్తున్నారు.

అమరావతిలో ఆందోళనలు మరింత విస్తృతమయ్యయాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ర్యాలీకి భారీ స్పందన లభించింది. ఉదయం తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహా ర్యాలీ.. 29 గ్రామాల గుండా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.

29 గ్రామాలకు చెందిన రైతులు, రైతు కూలీలు, మహిళలు మహార్యాలీలో పాల్గొన్నారు. ట్రాక్టర్లు, బైకులుపై జనం వేలాదిగా ర్యాలీ కోసం తరలివచ్చారు. ఇతర ప్రాంత రైతులు కూడా సంఘీభావం తెలుపుతూ మహా ర్యాలీలో పాల్గొన్నారు.

మహా ర్యాలీకి టీడీపీ సహా విపక్ష పార్టీల నాయకులు తరలివచ్చారు. మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల విధానంపై రాయలసీమ వాసులు భగ్గుమన్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ నినదించారు. అమరావతి నుంచి రాజధానిని మార్చితే కర్నూలులో పెట్టాలని డిమాండ్ చేశారు. రాయలసీమతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి అమరావతి అందుబాటులో ఉందన్నారు.

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో అనంతపురంలో నిరసనలు వెల్లువెత్తాయి. సీపీఐ, టీడీపీ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ జరిగింది. స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

కదిరిలో.. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. మెడలో కూరగాయల దండలు వేసుకుని, గడ్డి చేతబట్టి సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తిరుపతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పాదయాత్రకు అనుమతించారు.

Tags

Next Story