తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరు అప్రజాస్వామికం : బీజేపీ

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరు అప్రజాస్వామికమంటున్న బీజేపీ.. దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది. తుక్కుగూడలో ప్రజాతీర్పును టీఆర్‌ఎస్ అగౌరవపర్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. మహేశ్వరం మండలం శ్రీనగర్ కాలనీలో బీజేపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. దొడ్డిదారిని తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీఆర్‌ఎస్ దక్కించుకుందన్న లక్ష్మణ్.. ఆ పార్టీ పతనం తుక్కుగూడ నుంచే ప్రారంభమైందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు బీజేపీకి పెరిగిన ఆదరణకు.. తుక్కుగూడలో గెలిచిన వార్డులే నిదర్శనమన్నారు లక్ష్మణ్. ఒంటరిగా పోటీ చేసినా 80 మున్సిపాల్టీల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారని పేర్కొన్నారు. బీజేపీకి ఎమ్మెల్యేలు లేకపోయినా మంచి ఫలితాలు సాధించామన్న లక్ష్మణ్.. అధికార పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా ఏమీ చేయలేకపోయారన్నారు.
తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరుపై గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు లక్ష్మణ్. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక కేసీఆర్, కేటీఆర్ ఎక్కడికక్కడ కార్యకర్తలను అణచి వేస్తున్నారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com