ఆంధ్రప్రదేశ్

రాజధాని ముసుగులో వైసీపీ నేతలు విశాఖపై గద్దల్లా వాలారు : విశాఖ వాసులు

రాజధాని ముసుగులో వైసీపీ నేతలు విశాఖపై గద్దల్లా వాలారు : విశాఖ వాసులు
X

ప్రశాంత సాగరతీరంలో కేపిటల్‌ అంశం కల్లోలం రేపుతోంది. రాజధాని వస్తే అభివృద్ధి మాట దేవుడెరుగు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భయపడుతున్నారు. అమరావతికి వచ్చిన పలువురు విశాఖవాసులు.. రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసి.. తమ భయాలకు కారణాలను వివరించారు. రాజధాని ముసుగులో వైసీపీ నేతలు విశాఖపై గద్దల్లా వాలారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఆగడాలు తట్టుకోలేమనే భయంతోనే అప్పట్లో విశాఖలో విజయమ్మను ఓడించామని చెప్పారు.

ఏటా ఎక్కడో చోట కలిసే తామంతా ఈసారి అమరావతి గ్రామాలకు వచ్చామని... గత 2 రోజులుగా మందడం, తుళ్లూరు, అనంతవరం, ఉద్దండరాయునిపాలెంలో పర్యటించామని చంద్రబాబుకు తెలిపారు విశాఖ వాసులు. ఐతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని పరిరక్షించి.. రాష్ట్రాన్ని కాపాడతామని భరోసా ఇచ్చారు చంద్రబాబు. అటు.. మంగళవారం కూడా అమరావతి, అనంతపురం జిల్లా నుంచి వచ్చినవారు చంద్రబాబును కలిసి.. తమ గోడును వినిపించారు.

వైసీపీ నేతలు విశాఖలో భూదందా చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఏడెనిమిది నెలలుగా విశాఖలో మకాం వేసి.. ఇప్పటికే 32 వేల ఎకరాలను తమ గుప్పిట పెట్టుకున్నారని ఆరోపించారు. అక్కడ పులివెందుల పంచాయితీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు.. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని.. అది అమరావతే కావాలని విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు స్పష్టం చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే.. అక్కడ పెరిగే ధరలకు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్‌.. ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు.

అమరావతి తరలింపు అంశం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ఆందోళనలోకి నెట్టింది. రాజధాని రైతులు ఉద్యమాన్ని హోరెత్తిస్తుంటే.. విశాఖ, కర్నూలుతో సహా.. అన్ని ప్రాంతాలవారు వీరి ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు.

Next Story

RELATED STORIES