సునీతకు అన్నపైనే నమ్మకం లేదా?
కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఇష్యూస్ బేస్ గా యుద్ధం జరుగుతోంది. రివర్స్ టెండరింగ్, రాజధాని తరలింపు, మండలి రద్దు ఇలా ప్రభుత్వ నిర్ణయాలన్నీ వివాదాస్పదంగానే మారాయి. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ సడెన్ గా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు ఎందుకు చేరుకున్నారు? ఇంత బిజీ షెడ్యూల్ లో చిన్నాన్న కుటుంబంపై సడెన్ గా మమకారం ఎందుకు పెరిగిపోయింది.? జగన్ హైదరాబాద్ టూర్ వెనక అనూహ్య రాజకీయమే దాగుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీత సీబీఐ విచారణ కోరుతుండడం వైసీపీలో చర్చనీయాంశమైంది. ఉన్నట్టుండి ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అయితే.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉండగా.. సీఎం సోదరి సునీత న్యాయస్థానంలో పిటిషన్ వేయడాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె సోదరుడు జగన్.. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై నమ్మకం లేదని సునీత సూటిగా చెప్తున్నారు. అంతటితో ఆగకుండా.. తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ పరిణామాలు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ముఖ్యమంత్రి, సునీత సోదరుడు జగన్‌మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత అంటూ తరచు చెప్తుంటారు. మాటతప్పం, మడమతిప్పం అని అంటుంటారు. అలాంటిది.. వైఎస్ కుటుంబసభ్యురాలే.. ఆయనపై నమ్మకం లేదనడం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె మాటలతో వైసీపీ కార్యకర్తలకు నైతికంగా దెబ్బ తగులుతోంది. వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని పార్టీ సీనియర్లు, జగన్ శ్రేయోభిలాషులు హితవు పలకటంతో సీఎం జగన్ వెంటనే హైదరాబాద్ టూర్ ప్లాన్ చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబసభ్యులతో ఏర్పడిన గ్యాప్ పూడ్చుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా హైదరాబాద్ టూర్ పెట్టుకున్నారనేది టీడీపీ నేతల వెర్షన్. చిన్నాన్న కుటుంబంతో సయోధ్యకు లోటస్‌పాండ్ వేదికగా మారింది. రాత్రి డిన్నర్ మీటింగ్ కు వివేకా కుటుంబం, వైఎస్ ఫ్యామిలీ, రెండు కుటుంబాలకు చెందిన సన్నిహితులు హాజరయ్యారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 8 నెలలైనా.. చిన్నాన్న కుటుంబానికి సరైన న్యాయం చేయలేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. కనీసం పలకరించిన పాపాన పోకపోవడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జగన్.. చెల్లెలు సునీతతో హైదరాబాద్‌లో మాట్లాడబోతున్నారు. సునీతతో ఏం చెప్తారు అన్నది ఆసక్తిగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com