కరోనా వైరస్‌.. విశాఖలో అలర్ట్

కరోనా వైరస్‌.. విశాఖలో అలర్ట్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై విశాఖ అలర్టయ్యింది. వ్యాధి లక్షణాలతో ఇతర దేశాల నుంచి ఎవ్వరొచ్చినా.. వారికి క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేస్తే తప్ప నగరంలోకి అనుమతించని పరిస్థితి ఉంది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించి మరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో... చైనా, దుబాయ్, మలేషియా, సింగపూర్ నుంచి నగరానికి రాకపోకలు ఎక్కువగా ఉండడంపై ప్రత్యేక దృష్టి సారించారు.

మరోవైపు.. విశాఖ పోర్టు ట్రస్ట్ కూడా కరోనా విషయంలో అప్రమత్తమైంది. సింగపూర్‌ నుంచి వచ్చిన ఎమ్‌.వి.ఫార్చూన్‌సన్ అనే నౌకలో 21 మంది చైనీయులు ఉండడంతో.. వారికి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. వారిలో ఎవ్వరికీ వైరస్ సోకలేదన్న నిర్ధారణకు వచ్చాకే.. లోడింగ్ కార్యకలాపాలకు అనుమతించారు.

మరోవైపు.. కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. విశాఖలో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకినట్లు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని.. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ అర్జున్ తెలిపారు. ఆయాసం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, జలుబు వంటి లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. అవసరమైతే నమూనాలను పుణె పంపించి.. వైరస్‌ నిర్ధారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

కేజీహెచ్‌తో పాటు ప్రభుత్వ ఊపిరితిత్తుల వైద్యశాలలోనూ పది పడకలు ఏర్పాటు చేశారు. మొత్తానికి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు విశాఖ వైద్య యంత్రాంగం సిద్ధంగా ఉంది.

Tags

Next Story