44వ రోజుకు చేరిన రాజధాని రైతుల నిరసనలు.. సంఘీభావం ప్రకటించిన తెలంగాణ రైతులు

44వ రోజుకు చేరిన రాజధాని రైతుల నిరసనలు.. సంఘీభావం ప్రకటించిన తెలంగాణ రైతులు

అదే ఆశయం.. అదే సంకల్పం! అమరావతిని కాపాడుకోవడం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు రైతులు. వరుసగా 44వ రోజూ 29 గ్రామాల్లోనూ ప్రజలు కదం తొక్కారు.. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగాయి. రాయపూడి, మల్కాపురం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రులో నిరసనలు ఉద్ధృతరూపం దాల్చాయి.

ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అమరావతి కాపాడుకుని తీరతామంటూ రణనినాదం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లమీదకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.

అమరావతి రైతులకు వివిధ జిల్లాల ప్రజలు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ రైతులు కూడా సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 250 మంది మందడం వచ్చారు. మార్గ మధ్యంలో కంచికచర్లలో ఆగిన రైతులు అక్కడ దీక్షలో కూర్చున్న వారికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పక్కనే ఉన్నా రాజధాని రైతుల గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ నేత వంగవీటి రాధా మండిపడ్డారు. మందడంలో జేఏసీ నేతలు చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అమరావతి ఉద్యమానికి మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించింది జేఏసీ. స్వాతి సెంటర్‌ నుండి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు జరిగిన ప్రదర్శనలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రాజధాని రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

3 రాజధానులు, శాసనమండలి రద్దుని వ్యతిరేకిస్తూ..చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బైక్‌ ర్యాలీలు నిర్వహించింది టీడీపీ. అయితే పోలీసులు వీరిని అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. 44రోజులుగా ఉద్యమం చేస్తున్నస్పందించకపోగా..విశాఖలో ల్యాండ్‌పూలింగ్‌ కోసం జీవో ఇవ్వడంపై రాజధాని గ్రామాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావిస్తున్నారు రైతులు.

Tags

Read MoreRead Less
Next Story