మరో వివాదంలో రాహుల్‌గాంధీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, మోదీని నాథూరాం గాడ్సేతో పోల్చారు. గాడ్సే భావజాలం, మోదీ భావజాలం ఒక్కటేనని ఘాటుగా విమర్శించారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ నమ్ముతారని, ఐతే ఆ మాట చెప్పే ధైర్యం మోదీకి లేదన్నారు.
కేరళలోని వయనాడ్‌లో రాహుల్ పర్యటించారు. అక్కడ పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్‌ఆర్‌సీ అమలు ప్రతిపాదనను వ్యతిరేకించారు. భారతదేశ ప్రజలే తాము భారతీయులం అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తాను భారతీయుడినని, తన భారతీయతను నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు.
మోదీని గాడ్సేతో పోల్చడం తీవ్ర వివాదానికి దారి తీసింది. రాహుల్‌పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ప్రధానిపై ఇంత అక్కసు ఎందుకని సూటిగా ప్రశ్నించారు. నాజీ వారసత్వం నుంచి వ చ్చిన వ్యక్తుల నోటి నుంచి ఇంత కంటే మంచి మాటలు ఎలా వస్తాయని ఎద్దేవా చేశారు.
మోదీని పరుష పదజాలంతో విమర్శించడం రాహుల్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాగే మాట్లాడి చివాట్లు తిన్నారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీల పేర్లతో నరేంద్రమోదీ పేరును ప్రస్తావించిన రాహుల్, మోదీ పేరున్న వ్యక్తులంతా మోసకారులే అని సెటైర్లు వేశారు. ఐతే, ఆ స్టేట్‌మెంట్ బూమ్‌రాంగ్ అయ్యింది. రాహుల్ తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com