నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సెషన్ జరగనుంది. రెండు విడతలుగా సమావే శాలు కొనసాగనున్నాయి. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహిస్తారు. సమావేశాల తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రైల్వే పద్దును కూడా వార్షిక పద్దులోనే కలిపి ప్రకటించనున్నారు.

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల అజెండా, చర్చించాల్సిన బిల్లులపై సమాలోచనలు జరిపారు. సమావేశాలు సజావుగా సాగడానికి అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ప్రతిపక్షా లు సూచించే అన్ని అంశాలపై చర్చించడానికి సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. కీలక బిల్లుల ఆమోదానికి విపక్షాలు సహకరించాలని కోరింది.

బిల్లుల ఆమోదంపైనే కేంద్రప్రభుత్వానికి శ్రద్ధ ఉందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వివాదాస్పద చట్టాలపై చర్చకు ప్రభుత్వం ఇష్టపడడం లేదని ఆరోపించారు.

ఇక తెలుగు రాష్ట్రాలు కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తమ వాయిస్ వినిపించేందుకు సిద్ధమయ్యాయి. రాజధాని మార్పు, 3 రాజధానుల ప్రకటన, మండలి రద్దు, ఉపాధి హామీ పథకం నిధుల మళ్లింపు, మీడియాపై ఆంక్షలు, పోలవరం

పనుల నిలిపివేత, టీడీపీ నేతలపై అక్రమ కేసులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాజధాని తరలింపు ప్రయత్నాన్ని జాతి సంపద విధ్వంసంగా అభివర్ణించింది టీడీపీ. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటోందని జాతీయ స్థాయిలో తెలిసేలా వాయిస్ వినిపించాలని టీడీపీ నిర్ణయించుకుంది. అయితే..వైసీపీ కూడా ప్రతివ్యూహంతో సిద్దమవుతోంది. టీడీపీ వాదనను అడ్డుకుంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధుల అంశాన్ని సభలో లేవనెత్తాలని నిర్ణయించుకుంది.

మరోవైపు తెలంగాణ కూడా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంతో బడ్జెట్ సమావేశాలకు సిద్ధమైంది. ప్రధానంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై సమావేశంలో ఫోకస్ చేయనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులు, జీఎస్టీ, నీతి ఆయోగ్‌ నిధుల విడుదలపై కేంద్రాన్ని ఎంపీలు నిలదీయనున్నారు. దీనిపై ఎంపీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని చాలా కాలంగా టీఆర్‌ఎస్‌ కోరుతోంది. దీనిపై పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story