విశాఖలో ఏది జరగకూడదని భయపడ్డారో అదే జరుగుతోంది

విశాఖలో  ఏది జరగకూడదని భయపడ్డారో అదే జరుగుతోంది

ఏది జరగకూడదని భయపడ్డారో అదే జరుగుతోంది. ప్రశాంత నగరం విశాఖ మరో సీమ జిల్లాగా మారుతోంది. కాగడాలతో ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు, కవ్వింపు నినాదాలు, రోడ్డుపై బైఠాయింపులు, ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ పై దాడి. మునుపెన్నడూ లేనంతగా ఉక్కునగరంలో రాజకీయ ఉద్రిక్తతలకు వేదికైంది.

విశాఖలో రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు.. టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. సిటీలోని సర్క్యూట్ హౌజ్ నుంచి కాగాడాల ర్యాలీగా బయల్దేరిన వైసీపీ శ్రేణులు...ఆ తరువాత రెచ్చిపోయాయి. సెవెన్ హిల్స్ లోని టీడీపీ ఆఫీస్ ను ముట్టడించేందుకు అధికార పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు.

టీడీపీ ఆఫీస్ ముందు కవ్వింపు నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, ఎమ్మెల్యే వెలగపూడి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అప్పటివరకు చేష్టలుడిగి చూస్తుం డిపోయిన పోలీసులు పరిస్థితి చేయిదాటిపోతుండటంతో వారిని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కేజీహెచ్ తో పాటు మరికొన్ని ఆస్పత్రులకు వెళ్లే రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. పోటా పోటీగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వైసీపీ డిమాండ్ చేసినట్లుగానే విశాఖలోని ఎమ్మెల్యేలతో పాటు 23 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయిస్తాం. రాజధాని అజెండాతో మళ్లీ ఎన్నికల్లోకి వచ్చేందుకు మీరు సిద్ధమా అంటూ టీడీపీ కేడర్ వైసీపీకి సవాల్ విసిరింది.

ఏపీలో జగన్ ప్రభుత్వం కేవలం కుట్ర పాలన చేస్తోందని.. ప్రజా పరిపాలనను మర్చిపోయిందని టీడీపీ విమర్శించింది. కేవలం చంద్రబాబుపై కక్ష సాధించటమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తోందని విమర్శించారు. అసలు 3 రాజధానులు ఎవరు అడిగారని ప్రశ్నించారు.

రాజధాని ఇష్యూతో మొత్తానికి విశాఖ రణరంగంగా మారింది. ఎన్నడూ లేనిది రాజకీయ కక్షలకు వేదికగా నిలిచింది. ఐటీ హబ్ గా, ఇండస్ట్రియల్ సిటీగా, పర్యాటక ప్రాంతంగా ఓ బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖకు ఈ పొలిటికల్ టెన్షన్స్ మచ్చగా మారుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story