డీఆర్సీ మీటింగ్ ప్రొటోకాల్ వివాదంపై స్పందించిన రఘురామకృష్ణంరాజు

డీఆర్సీ మీటింగ్ ప్రొటోకాల్ వివాదంపై స్పందించిన రఘురామకృష్ణంరాజు

పశ్చిమ గోదావరి జిల్లా సమీక్ష సమావేశంలో రగులుకున్న ప్రొటోకాల్ వివాదం.. చినికి చినికి గాలివానలా మారింది. వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలను తేటతెల్లం అయ్యాయి. వేదికపై తమకు సీట్లు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైసీసీ ఎంపీలు వాకౌట్ చేశారు. దీంతో అధికారపార్టీ నేతల మధ్య అంతర్గత పోరు బయటపడింది.

బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వేదికపై సీటు కేటాయించలేదు. దీంతో తనకు ఎందుకు సీటు కేటాయించలేదని ఆయన ప్రశ్నిస్తే.. ఎంపీలకు వేదికపై సీట్లు కేటాయించలేదనే సమాధానం వచ్చింది. అంతేకాదు, మీరు కేంద్ర మంత్రులైతేనే.. వేదికపై సముచిత స్థానం కల్పిస్తామని.. జిల్లా ఇంఛార్జి మంత్రి పేర్ని నాని చెప్పడంతో వివాదం మరింత ముదిరింది.

వేదికపై సీటు కేటాయించకపోవడంపై మనస్తాపానికి గురైన ఎంపీ రఘురామకృష్ణం రాజు.. సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కొద్దిసేపటికే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర మంత్రులను ఒకలా.. ఎంపీలను మరోలా ట్రీట్ చేస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కూడా అసహనం వ్యక్తం చేశారు.

డీఆర్సీ మీటింగ్ ప్రొటోకాల్ వివాదంపై స్పందించిన రఘురామకృష్ణంరాజు.. ఇది తనకు జరిగిన అవమానం కాదని.. తమను ఎంపీలుగా ఎన్నుకున్న ప్రజలకు, పార్లమెంటరీ వ్యవస్థకు జరిగిన అవమానమని అన్నారు. గత సమావేశాల్లోనూ ఇలాగే జరిగిందని.. ఇప్పుడు మరోసారి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంపై.. ఎంపీ రఘురామకృష్ణం రాజు.. సీఎం జగన్ మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. పార్లమెంట్ సభ్యుడినైన తనకు సమీక్ష సమావేశంలో సరైన స్థానం కల్పించకుండా అవమానించారని లేఖలో పేర్కొన్నారు. వేదికపై కాకుండా కింద ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోవాలని తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై జిల్లా ఇంఛార్జి మంత్రి పేర్ని నాని స్పందించారు. తాము ప్రోట్ కాల్ ప్రకారమే నడుచుకున్నామని అన్నారాయన. అలా లేదని నిరూపిస్తే సారీ చెప్పడానికి సిద్ధమని తెలిపారు.

ఈ మొత్తం వ్యవహారం క్షమాపణతో చల్లారేలా కనిపించడం లేదు. భవిష్యత్ రాజకీయ పునరేకీకరణకు దారితీసే పరిస్థితి కనపడుతోంది. ఈ వివాదం అప్పటికప్పుడు వచ్చిన సమస్యగా లేదని.. అలాగని యాధృచ్చికంగా జరిగిందని చెప్పలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో జరిగిన పలు ఘటనలు గుర్తుచేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్రమోదీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ వివాదం చెలరేగడం పలు సందేహాలకు, ప్రచారానికి దారితీస్తోంది. మొత్తం వ్యవహారం గమనిస్తే.. ఎంపీతో అధికార పార్టీ కయ్యానికి వేసిన తొలిమెట్టుగా కనపడుతోందని.. విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story