అలుపెరగకుండా సాగుతోన్న రాజధాని రైతుల పోరాటం

అలుపెరగకుండా సాగుతోన్న రాజధాని రైతుల పోరాటం

అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. రాజధాని రైతుల పోరాటం అలుపెరగకుండా సాగుతోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దంటూ 29 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగాయి. రాయపూడి, మల్కాపురం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రులో ఆందోళనలు తీవ్రమయ్యాయి. రాజధాని ఉద్యమంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్‌ సర్కార్‌ వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. అమరావతిని కాపాడుకుంటామంటూ.. ఎక్కడికక్కడ రోడ్లమీదకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. జగన్‌ మనసు మారాలంటూ మందడంలో సామూహిక రామనామ జపం చేశారు.

అటు.. సీఎం జగన్‌ పక్క రాష్ట్రానికి సామంతుడిలా పనిచేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. వెలగపూడిలో రైతులు, మహిళలు చేపడుతున్న దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు.

మందడంలో రైతులు చేపట్టిన దీక్షకు మాగంటి బాబు సంఘీభావం తెలిపారు.. వారితోపాటు దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మరోవైపు.. విజయవాడ కృష్ణలంకలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఇందులో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు

అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించిన జేఏసీ.. ఫిబ్రవరి 7న విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనుంది. సభకు అనుమతి కోరుతూ పోలీస్‌కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు జేఏసీ నేతలు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

Tags

Next Story