వైసీపీ సర్కార్‌ను ఆటాడుకుంటున్న చంద్రబాబు

వైసీపీ సర్కార్‌ను ఆటాడుకుంటున్న చంద్రబాబు

వరుస ట్వీట్లతో వైసీపీ సర్కార్‌ను ఓ ఆటాడుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నేతలపైనా ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. హిందూపూర్‌లో టీడీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి, విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని కాగడాలతో చుట్టుముట్టడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారాయన. అవినీతి, చేతకానితనం, తెలివితక్కువతనం దేశం మొత్తం తెలిసిపోయి.. అందరూ తుగ్లక్‌ అంటుంటే ఉక్రోషం పట్టలేకే ఈ దాడులు చేస్తున్నారంటూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. దేశంలోనేఅతి పెద్ద ఎఫ్‌డీఐ, కియా కార్ల పరిశ్రమ, గార్మెంట్‌ ఇండస్ట్రీస్‌, విండ్‌ - సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ వంటి అనేక పరిశ్రమలతో సీమలో వేలాది మందికి ఉపాధి కల్పించిన తాము దేశద్రోహులమా అంటూ ప్రశ్నించారు. కియా యాక్సిలరీ యూనిట్లు పుణేకు తరిమేసి.. వేలాది ఉద్యోగాలు పోగొట్టిన వైసీపీ వాళ్లు ద్రోహులా అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు చంద్రబాబు.

ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో రౌడీలు.. కాగడాలు పట్టుకుని తిరగడం, సభ్యత్వం ఇవ్వని క్లబ్‌ల భూములకే ఎసరుపెట్టడం, ముడుపులు వాటాలు ఇవ్వని కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేయడం, ఇదే విశాఖకు చేస్తున్న మేలు అంటూ.. వైసీపీ నేతల్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల అభివృద్ధికి టీడీపీ కృషి చేసిందని... కానీ ఇప్పుడు అధికార వికేంద్రీకరణ ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి రాష్ట్రాన్ని వైసీపీ అగ్ని గుండం చేసిందంటూ మండిపడ్డారు.

అంతేకాదు... పించను అర్హత వయస్సు ఐదేళ్లు తగ్గిస్తే.. లబ్దిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉంది... ఏమిటీ జగన్మాయా అంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు. 8 నెలల్లో 7 లక్షల పించన్లుకు కోత పెట్టడం పండుటాకులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. 45 ఏళ్లకే బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు పించను ఇస్తామని హామీ ఇచ్చి ఏమార్చడం మోసం కాదా అని నిలదీశారు. కేంద్రం ఇచ్చిన 6 వేలకు అదనంగా 12 వేల 500 ఇస్తామని చెప్పి రైతులను సైతం మోసం చేశారన్నారు. నిరుద్యోగభృతి రద్దు చేసి యువతకు టోపీ పెట్టారు. ఇంత మోసకారి కాబట్టే.. 12 ఛార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్ కింద విచారణ ఎదుర్కొటున్నారని... అయినా మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Tags

Next Story