వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ ఆదాయం పెరిగే అవకాశం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ ఆదాయం పెరిగే అవకాశం

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు ఆర్థిక సర్వే లోక్‌సభ ముందుకు వచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. వ్యవస్థల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా 2019-20 సర్వేను రూపొందించారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి నైతిక విలువలతో కూడిన సంపద చాలా కీలకమని ఆర్థిక సర్వే తెలిపింది. ఏప్రిల్ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6 నుంచి 6.5 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది. ప్రపంచ పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయనే ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ పన్ను ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే చెప్పింది.

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యానికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనుందని.. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోనుందని తెలిపింది. మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేసిందుకు ప్రభుత్వం అధికంగా నిధులు సమకూరుస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. రియల్‌ ఎస్టెట్‌ కంపెనీలు అమ్ముడుపోని ఇళ్ల ధరలను తగ్గించాలని.. ఇళ్ల ధరలను తగ్గించడం ద్వారా అమ్మకాలు పెరిగి బ్యాంకులలో తీసుకున్న రుణాలను చెల్లిస్తారని సర్వే స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమనం దేశ ఎగుమతులపై ప్రభావం చూపించిందని తెలిపింది. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానిక వృద్ధి రేటు 5 శాతానికి అంచనా వేసినా... అంతర్జాతీయ మందగమనం కారణంగా అనుకున్న లక్ష్యాలను సాధించలేదని పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుండి ప్రారంభమయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సడలించాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రభుత్వం ఆహారానికి సంబంధించిన సబ్సిడీలను హేతుబద్దీకరించాలని సర్వే అభిప్రాయపడింది. ప్రభుత్వం ధరలను కట్టడి చేయడానికి ఆహార ధాన్యాలను మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు పంపిణి చేసిందని సర్వే తెలిపింది. గత ఏడాది బడ్జెట్‌లో ఆహార రాయితీల కోసం ప్రభుత్వం 1.84 లక్షల కోట్లు బడ్జెట్‌లో కేటాయించిందని వెల్లడించింది.

2011 నుంచి 2018 మధ్య 2 కోట్ల 62 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందన్న సర్వే.. హైవేలు, రోడ్లపై పెట్టుబడులు 2014-15 నుంచి 2018-19 వరకు మూడు రెట్లు పెరిగాయని తెలిపింది. భారత్‌లో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతంగా జరగాలని సూచించింది. అలాగే ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకం అన్న సర్వే.. మాఫీలు రుణ వ్యవస్థను దెబ్బతీస్తాయని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story