కరోనా వైరస్ ప్రభావంతో చైనా వ్యాప్తంగా హై అలర్ట్

కరోనా వైరస్ ప్రభావంతో చైనా వ్యాప్తంగా హై అలర్ట్
X

కరోనా వైరస్ వ్యాప్తి మరింత ప్రమాదకరంగా మారడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ పుట్టుకకు వేదికైన వూహాన్‌ నగరాన్ని దిగ్బంధించింది. అక్కడి నుంచి ఎవ్వరినీ బయటకు వెళ్లనివ్వడం లేదు. రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి వైద్య బృందాలు, అత్యవసర సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇంత చేస్తున్నా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు.

వైరస్ వ్యాప్తి ఎంతకూ తగ్గకపోవడంతో చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. బాధితులు ఇళ్లలోనుంచి బయటికి రాకుండా.. తలుపులకు చెక్కలు అడ్డుపెట్టి మేకులు కొడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బాధితుల ఇళ్లవైపు వెళ్లకుండా తలుపులకు ఇనుప సంకెళ్లు వేస్తున్నారు. రోగులు బయటికి రావడం వల్ల వ్యాధి మరింత విస్తరిస్తోందని.. అందువల్ల బాధితుల ఇళ్లను దిగ్భందనం చేయకుండా తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల బాధితుల ఇళ్లపై ప్రజలు దాడులు చేస్తున్నారు. బలవంతంగా ఇళ్లల్లో నిర్బంధించి తాళాలు వేస్తున్నారు.

మరోవైపు ఈ వైరస్ ఖండాంతరాలకు వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించింది. వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ దేశాలు బయోసెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి.

ఇక, అమెరికా ప్రభుత్వం తాజాగా ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించింది. చైనాకు వెళ్లే అమెరికన్లు.. తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాతే.. చైనాకు వెళ్లేలా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలిపింది.

ఇదిలావుంటే, అలీబాబా వ్యవస్థాపకుడు, చైనా దేశ అత్యంత ధనవంతుడు జాక్ మా,.. కరోనా వైరస్ నివారణ కోసం భారీ విరాళం ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనడంలో సహాయపడటానికి తన ఫౌండేషన్ ద్వారా 100 మిలియన్ యువాన్లను విరాళంగా ఇచ్చారు.

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సెర్చింజన్‌ గూగుల్‌ తనవంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. చైనాలో రోజురోజుకీ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై అవగాహన కల్పించేందుకు గూగుల్‌ నడుం బిగించింది. అత్యవసర సమయాల్లో జారీ చేసే ఎస్‌ఓఎస్‌ అలర్ట్‌ని సూచిస్తూ ఈ వైరస్‌కు సంబంధించిన అనేక విషయాలను నెటిజన్లకు చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది.

Tags

Next Story