కోర్టు ప్రాంగణంలో కన్నీటి పర్యంతమయిన నిర్భయ తల్లి

కోర్టు ప్రాంగణంలో కన్నీటి పర్యంతమయిన నిర్భయ తల్లి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులు మరోసారి ఉరి తప్పించుకున్నారు. ఇవాళ ఉదయం ఆరుగంటలకు అమలు చేయాల్సిన వీరి ఉరిశిక్షపై పటియాలా కోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీరి ఉరిని వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ రాష్ట్రపతి క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నాయి. దోషులకు సంబంధించిన పిటిషన్‌లు పెండింగ్‌లో ఉండగా ఉరి తీయకూడదని జైలు మాన్యువల్ పేర్కొంటోంది. అలాగే ఒక కేసులో ఉరిశిక్ష పడిన నిందితులందర్నీ ఒకేసారి ఉరి తీయాలని కూడా జైలు మాన్యువల్‌లో ఉంది.

ఢిల్లీ హైకోర్టు జారీచేసిన డెత్‌ వారెంట్ ప్రకారం.. ఇవాళ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. ఈ పిటిషన్‌పై పాటియాలా కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో తిహార్ జైలు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ వాదనలు వినిపించారు. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని.. మిగతా ముగ్గుర్ని ఉరి తీయొచ్చని న్యాయస్థానానికి తెలిపారు. దోషులు ఉరిని వాయిదా వేయడం కోసం కుయుక్తులు పన్నుతున్నారని వాదించారు.

అయితే దీనిపై దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ విభేదించారు. జైలు నిబంధనల ప్రకారం.. ఒక కేసులో ఎక్కువ మంది దోషులు ఉన్నప్పుడు ఒక్క దోషి అభ్యర్థన పెండింగ్‌లో ఉన్నా.. మిగతా వారిని ఉరితీయడం సాధ్యం కాదని గుర్తుచేశారు. అంతేకాదు, దోషులేమీ ఉగ్రవాదులు కాదని.. వారు అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే వరకు శిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. అంతవరకు ఈ కేసును నిరవధికంగా వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఉరిశిక్షను వాయిదావేస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉరిశిక్ష అమలును ఆపేయాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది.

దోషులు న్యాయస్థానాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నిర్భయ తరఫు లాయర్ అన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు క్లియర్ గా వున్నా.. ఉరిని ఎందుకు వాయిదా వేశారో అర్థం కావడం లేదు అని తెలిపారు.

నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌.. ఆ నలుగురికి ఎన్నడూ ఉరిశిక్ష అమలు కానివ్వని తనను సవాలు చేశాడని పేర్కొన్నాడు. అయితే తాను మాత్రం తన కూతురికి న్యాయం జరిగేంత వరకు.. దోషులను ఉరి తీసేంత వరకు పోరాటం ఆపబోనని స్పష్టం చేశానని తెలిపారు.

తాజా తీర్పుతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష మూడోసారి వాయిదాపడింది. వాస్తవానికి జనవరి 22న ఉరి తీయాలని న్యాయస్థానం తొలుత డెత్ వారంట్ జారీ చేసింది. క్యూరేటివ్ పిటిషన్ల కారణంగా దాన్ని ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు. ఇక వినయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్‌ కారణంగా ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది.

Tags

Read MoreRead Less
Next Story