నేడు రథ సప్తమి.. ముస్తాబైన తిరుమల
రథ సప్తమికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్య జయంతి సందర్భంగా ఇవాళ రథ సప్తమి వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీమలయప్ప స్వామి వారు.. సప్త వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిస్తారు. రథసప్తమిని పురస్కరించుకుని.. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, దివ్యదర్శనం టోకన్లను టీటీడీ రద్దు చేసింది.
ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ, 9గంటలకు చిన శేషవాహన సేవ, 11 గంటలకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు హనుమంత వాహనసేవ, 2గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం, 4గంటలకు కల్పవృక్ష వాహనసేవ, 6గంటలకు సర్వభూపాల వాహనసేవ, రాత్రి 8గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలోని ఆస్థాన మండపంలో సేవకులతో సమావేశమైన ఈవో... రథసప్తమి ఏర్పాట్లపై సమీక్షించారు.
అటు శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లిలోనూ రధ సప్తమి శోభ సంతరించుకుంది. సుర్య భగవానుని జయంతిని పురస్కరించుకుని అరసవిల్లిలో రథ సప్తమివేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఆంధ్రా, తెలంగాణ, ఒడిషా నుంచి భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అర్థరాత్రి 12 గంటల 15 నిమిషాలకు అభిషేకాలతో సూర్య భగవానుని జయంతి వేడుకలకు అంకురార్పణ జరిగింది. ఉదయం స్వామివారి నిజరూపంలో దర్శనమిస్తారు. పుష్పాలంకరణ సేవ, ఏకాంత సేవల అనంతరం రాత్రి పవళింపు సేవవలతో స్వామివారి జయంతి వేడుకలు ముగుస్తాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com