ఢిల్లీకి చేరిన అమరావతి రైతులు

ఢిల్లీకి చేరిన అమరావతి రైతులు

అమరావతిలో ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. 46వ రోజూ 29 గ్రామాలు నిరసనలతో హోరెత్తాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. విశాఖలో రాజధాని కోసం ఏర్పాట్లు చేయడం, కర్నూలుకు న్యాయవిభాగాల తరలింపు ప్రక్రియ మొదలుపెట్టడంపై రైతులు భగ్గుమంటున్నారు. అందుకే ఇక సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే ఢిల్లీ చేరిన పలువురు రైతులు.. ఆదివారం పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

అమరావతిని కాపాడుకోవడం కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు రైతులు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేస్తూ.. 29 గ్రామాలు ఒక్కటిగా ఉద్యమిస్తున్నాయి. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగాయి. రైతులకు మద్దతుగా పలుచోట్ల 24 గంటల దీక్షలు చేపట్టారు. రాయపూడి, మల్కాపురం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రులోనూ నిరసనలు తీవ్రమయ్యాయి. రాజధాని ఉద్యమంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

అమరావతికి ఉద్యమానికి అన్నివర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున దీక్షాశిబిరాలకు తరలివస్తున్నారు. అటు రాయపూడిలో ముస్లిం మహిళలు దీక్ష చేపట్టారు. రాజధాని రైతులకు మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రతిసారి.. జగన్ తనపైకక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

తుళ్లూరులో రైతుల ఆందోళనకు మద్దుతు తెలిపారు మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు. కరోనా వైరస్ తరహాలో ఏపీకి జగన్ వైరస్ పట్టుకుందని విమర్శించారు. రాజధాని ఉద్యమాన్ని మహిళలే నడిపిస్తున్నారని చెప్పారు.

అటు రైతుల ఆందోళనలను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ విభాగాలన్ని వెలగపూడి సచివాలయంలో ఉన్నాయి. తాజాగా వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.ఈ కార్యాలయాలకు అవసరమైన బిల్డింగ్‌లను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు, కర్నూలు కలెక్టర్‌కు జగన్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ తీరుపై భగ్గుమంటోంది అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ. ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు, రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాతో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. జేఏసీ ఆధ్వర్యంలో 16 మంది రైతులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఆది, సోమ వారాల్లో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story