కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి

కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీనియర్ అధికారులతో దాదాపు నాలుగు గంటల పాటు కేసీఆర్ సమీక్షించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

2019-2020 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు 3 వేల 731కోట్లు తగ్గాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం నుంచి 19వేల 718 కోట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక.. కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారు మారు అయిందన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా తగ్గించడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతగా ఆయన అభివర్ణించారు. 2019-20లో ఏకంగా 18.9 శాతం నిధులు తగ్గడమే ఇందుకు నిదర్శనమన్నారు. 2020-21 బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ రాష్ట్రానికి 2 రకాల నష్టం వాటిల్లిందని... రాష్ట్రాలకు కేంద్రం చెల్లించే పన్నుల వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గిస్తున్నారు అని కేసీఆర్ అన్నారు.

15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించిందని కేసీఆర్ గుర్తు చేశారు. దీనివల్ల రాష్ట్రానికి 2 వేల 381 కోట్ల నిధులు తగ్గనున్నట్లు చెప్పారు. కేంద్రం మాటకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతోందన్నారు. జీఎస్టీ విషయంలో కూడా కేంద్రం పెద్ద మోసం, దగా చేస్తున్నదన్నారు. 14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారన్నారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా ఇంకా 11 వందల 37 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు.

కేంద్ర బడ్జెట్లో పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోత పెట్టారని. దీనివల్ల శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు కేసీఆర్‌. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించామని.. దాని నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందన్నారు. ఇందులో కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించామని... కానీ కేంద్రం నిధులు కేటాయించలేదన్నారు కేసీఆర్‌. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్రం తీసుకోలేదన్నారు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్యేనని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story