అమరావతి కోసం ఎందాకైనా పోరాడతాం : జేఏసీ నేతలు

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 47 రోజులుగా అక్కడి ప్రజలు అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు.. మహాధర్నాలు, ర్యాలీలు చేపట్టినా, నిరసన దీక్షలతో హోరెత్తిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. అటు అమరావతి కోసం ఎందాకైనా పోరాడతామంటున్నారు పరిరక్షణ సమితి జేఏసీ నేతలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు.. విజయవాడలో వివిధ రైతు సంఘాల నేతలు , రైతులతో సమావేశం నిర్వహించిన జేఏసీ నేతలు పలు కీలక తీర్మానాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తీర్మానం చేశారు.. వారం రోజుల్లో రైతు రక్షణ యాత్రను ప్రారంభించనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు.
రాష్ట్రమంతటా పర్యటించి ఒకే రాజధానిని కోరుకుంటున్న ప్రజల ఆందోళనలను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు జేఏసీ నేతలు. కరపత్రాలు, స్టిక్కర్లు, గోడ పత్రికల ద్వారా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని విస్తృత ప్రచారం చేయనున్నట్లు వారు వివరించారు. ఇక మార్చ్‌లో జరిగే పార్లమెంటు సమావేశాలకు రైతులు, రైతు సంఘ నేతలు రైళ్లలో ఢిల్లీ వెళ్లి అమరావతి వాణి వినిపించేలా కార్యాచరణ రూపొందించారు.
రాజధానికి భూములిచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని, ఆందోళనలపై ప్రభుత్వం విధించిన పోలీసు నిర్బంధాన్ని వెంటనే ఎత్తివేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు. చట్టాలను అతిక్రమిస్తున్నామని తెలిసి కూడా తప్పు చేయడం నిద్రపోతున్నట్లు నటించడమేనని జేఏసీ నేతలన్నారు. ఇలాంటి వారిని మేల్కొలిపేందుకు ప్రజా పోరాటాలు చేయక తప్పదన్నారు. రైతులు, రైతు సంఘ నేతలు తమ పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించినట్లు అమరావతి జేఏసీ నేతలు తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com