బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి.. ట్రయల్ రన్‌కు సిద్ధం..

బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి.. ట్రయల్ రన్‌కు సిద్ధం..

రెండు దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న వాహనదారుల కష్టాలకు తెర పడనుంది. నిత్యం రద్దీతో ఉండే బెంజి సర్కిల్, కాన్వెంట్ రోడ్, రమేష్ హాస్పటల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులకు ఉపశమనం కలగనుంది. బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ముందుగా సోమవారం సాయంత్రం దీని పై ట్రయల్ రన్ నిర్వహించి.. అనంతరం రాకపోకలకు అనుమతించేందుకు నేషనల్ హైవే మరియు పోలీసు ఉన్నతాధికారులు సన్నద్దమవుతున్నారు.

బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్-1 పూర్తిస్థాయిలో సంసిద్దమైంది. ఇకపై వాహనదారులకు అందుబాటులోకి రాబోతుంది. గతవారం రోజులుగా తుది మెరుగులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దమైన బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్-1 పై వాహనాలు తిరిగేందుకు అనుమతులు కల్పించడానికి వీలుగా జాతీయ రహదారుల సంస్థ (ఎన్ ఎచ్) అధికారులు ట్రాయల్ రన్ నిర్వహించనున్నారు. ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించాలన్న తలంపుతో కేంద్రం ఉండటంతో ట్రయల్ రన్ అనంతరం యధావిధిగా బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పై రాకపోకలు అనుమతించనున్నారు. దీంతో అధికారిక ప్రారంభోత్సం ఏమీ లేకుండానే ఫ్లై ఓవర్ ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు చూస్తున్నారు. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పై రెండు వైపులా రాకపోకలను అనుమతించాలా.. లేక పూర్తిగా వన్ వే గానే వాహనాలకు అనుమతివ్వాలనే అంశాన్ని కూడా ట్రయల్ రన్ తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ ను రెండు దశలుగా ఆరు వరుసల్లో నిర్మించాల్సి ఉంది. మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయని నేషనల్ హైవే అధికారులు తెలిపారు. ముందు ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేవలం 85మీటర్ల వరకు అనుమతి వచ్చింది, ఆ తరువాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ సహాయంతో ఎంపీ కేశినేని నాని తోడ్పాటుతో 1.85 కిలోమీటర్లు పొడిగించడం జరిగింది. ఈ ఫ్లై ఓవర్ పై మరో రెండు, మూడు రోజుల్లో రాకపోకలు ప్రారంభమైతే బెజవాడ వాసులకు కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. రెండవ దశ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఏప్రిల్ లో టెండర్ లను పిలవనున్నారు. రెండు దశాబ్ధాల నుంచి ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ కావాలని వాహనదారులు కోరుతున్నారు, ఆ కల ఇప్పటికి నెరవేరుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story