నిత్యం గ్యాస్ లీకేజీలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నస్థానికులు

నిత్యం గ్యాస్ లీకేజీలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నస్థానికులు

ఉప్పూడి గ్రామం ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. నిన్నటి నుంచి ONGC రిగ్ నుంచి గ్యాస్ భారీగా ఎగిసిపడుతుండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ కనిపిస్తోంది. నిపుణుల బందం రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఐతే.. లీకేజీ కంట్రోల్‌పై ONGC అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ గ్యాస్ లీకేజీలు తమ గుండెల్లో కుంపటిగా మారాయంటున్నారు. రాజమహేంద్రవరం, నరసాపురం, తాటిపాక నుంచి స్పెషల్ టీమ్‌లు వస్తున్నాయని.. వీలైనంత త్వరగా గ్యాస్ లీకేజీ అదుపు చేస్తామని చెప్తున్నా ఇంత వరకూ ఆ టీమ్‌లు చేరుకోలేదని స్థానికులంటున్నారు.

తూ.గో. జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలోని గంటివారిపేటలో పాత రిగ్‌ వద్ద తిరిగి కార్యకలాపాలు నిర్వహించేందుకు కొన్ని పనులు చేస్తున్న సమయంలో.. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గ్యాస్ ఉవ్వెత్తున ఎగిసిపడింది. అక్కడే ఉన్న సిబ్బంది కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. భారీ స్థాయిలో గ్యాస్ ఎగదన్నడంతో సిబ్బంది కూడా అక్కడి నుంచి భయంతో పరుగులు తీసారు. స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలోని ఇళ్లలో వాళ్లను ఖాళీ చేయించారు. నిన్నటి నుంచి గ్రామానికి కరెంట్ సరఫరా నిలిపివేశారు. చుట్టుపక్కల సెల్ టవర్లు కూడా ఆపేశారు. ఎక్కడా అగ్నిప్రమాదానికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఉప్పూడి గ్రామంలో 10 ఏళ్ల క్రితం ONGC డ్రిల్లింగ్ చేసి తవ్విన బావిని తర్వాత అక్కడ నిక్షేపాలు తగ్గిపోవడంతో సీల్ చేసి వదిలేశారు. ఇలాగే చాలా బావులను సీల్ చేశారు. అలాంటి వాటి నిర్వహణను 2016లో PFHకు అప్పగించారు. ప్రస్తుతం వీటి నిర్వహణ వ్యవహారాలు చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. చాన్నాళ్లుగా మూసేసిన వాటిని చెక్ చేసేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ జోన్లలో పేరుకుపోయిన గ్యాస్ ఒక్కసారిగా పైకి ఎగజిమ్మే ప్రమాదం ఉంది. ఉప్పూడిలో ఇప్పుడిదే జరిగింది. రిగ్‌ మరమత్తులు చేసే సమయంలో వాల్‌ వదిలేయడంతో గ్యాస్‌ ఉవ్వెత్తున ఎగిసి పడింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్యాస్ లీకేజీ నేపథ్యంలో ఫైర్ ఇంజిన్ల సాయంతో నీటిని చల్లి తాత్కాలికంగా మంటలు చెలరేగకుండా చూసేందుకు ప్రయత్నాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story