టీఆర్‌ఎస్‌ లో చేరిన టీడీపీ నేత గణేష్‌ గుప్త

టీఆర్‌ఎస్‌ లో చేరిన టీడీపీ నేత గణేష్‌ గుప్త

రాష్ట్రంలో బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వారికి పెద్దపీట వేసే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శంషాబాద్‌ టీడీపీ నేత గణేష్‌ గుప్తాతోపాటు పలువురు కార్యకర్తలు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.. కండువా కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. విపక్షాల తీరుపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేక రెండు జాతీయపార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 57 శాతం సీట్లు మహిళలకు కేటాయించామని గుర్తు చేశారు.

11 మంది ఆర్యవైశ్యులు మున్సిపల్‌ చైర్మన్‌లు అయ్యారని.. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అని కేటీఆర్‌ అన్నారు. ఏ ఎన్నికలు జరిగినా ప్రజలంతా టీఆర్‌ఎస్‌ పార్టీ వైపు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌పై దేశవ్యాప్తంగా నమ్మకం పోయిందని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌ రెబెల్సే ఎక్కువ శాతం గెలిచారని పేర్కొన్నారు. 1200 స్థానాల్లో కాంగ్రెస్‌ బీ ఫారాలు కూడా తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం లేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని.. కానీ, అసలు కాంగ్రెస్‌ మీద ప్రజలకు నమ్మకం లేదని వారు గ్రహించలేకపోతున్నారని మంత్రి అన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితిలో ఉందని.. కేంద్రం నుంచి రాష్ర్టానికి ఉపయోగపడే ఒక్క పని కూడా అక్ష్మణ్‌ చేయలేదని కేటీఆర్‌ విమర్శించారు. నీతిఅయోగ్‌ కూడా తెలంగాణ పథకాలను ప్రశంసించిందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం మొండిచేయి చూపినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.. మరోవైపు శంషాబాద్‌ వరకు మెట్రోరైల్‌ విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story