వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణం.. తొమ్మిది రోజుల్లోనే ఎలా సాధ్యం

వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణం.. తొమ్మిది రోజుల్లోనే ఎలా సాధ్యం

మాయల్లేవ్.. మంత్రాల్లేవ్.. కేవలం ముందు జాగ్రత్త. వచ్చినప్పుడు పరుగులు పెట్టేకంటే.. ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి అని ముందుగానే అంచనా వేస్తుంది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా. అందుకే దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బాధితుల కోసం కేవలం రోజుల్లోనే అన్ని వైద్య వసతులతో కూడిన వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించింది. కరోనా వైరస్ వచ్చిన వూహాన్ నగరానికి దగ్గరలోనే ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టింది.

వూహాన్ నగర జనాభా 1.1 కోట్లు ఉంటే ఈ వైరస్ బారిన పడి రోజూ పదుల సంఖ్యలో మృత్యువాతకు గురవుతున్నారు. ముందు ఈ వైరస్‌ని కట్టడి చేసే నిమిత్తం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది చైనా. ఇందులో భాగంగానే హువుశెన్షన్ హాస్పిటల్‌ని నిర్మిస్తున్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దీని నిర్వహణ బాధ్యతల్ని చేపట్టింది.

కరోనా కలకలం ఒక వార్త అయితే.. అందకంటే మేజర్ న్యూస్ అయింది వెయ్యిపడకల ఆసుపత్రి ఇంత త్వరగా ఎలా నిర్మించగలిగారు అని.. విపత్తుల సమయంలో తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుకోసం ఉపయోగించే ప్రీ ప్రాబ్రికేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ ఇప్పుడు కూడా ఉపయోగపడ్డాయి. వీటన్నింటినీ ఒకచోటికి చేర్చి నిర్మాణం పూర్తి చేశారు. ఆర్మీ భాగస్వామ్యం కూడా ఉండడంతో ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తయింది.

మొత్తం 7వేల మంది కార్మికులు 24 గంటలూ కష్టపడ్డారు. వెయ్యికి పైగా యంత్రాలు పని చేశాయి. 2 లక్షల 69వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి సిద్ధమయింది. దీనిలో 30 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, 419 వార్డులు ఉన్నాయి. 1400 మంది వైద్యులు అందుబాటులో ఉంటారు. దీంతో పాటు మరో 1600 పడకల ఆసుపత్రి కూడా కరోనా బాధితుల కోసం సిద్ధమవుతోంది. ఇది ఇలా ఉండగా కరోనా వైరస్‌కు మందు కనుగొనేందుకు అనేక పరిశోధన సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాలోని వైద్య పరిశోధనలు కొంత వరకు పురోగతిని సాధించినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story