49వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు

49వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు

రోజు రోజుకూ అమరావతి ఉధ్యమం ఉధృతమవుతోంది. 49వ రోజు కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు రాజధాని రైతులు.. గత 50 గంటలుగా దీక్షలు చేస్తున్న కొందరు.. మంగళవారం కూడా నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. గాంధీ వర్థంతిని పురస్కరించుకొని అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు సత్యాగ్రహ దీక్షలో కూర్చొన్నారు. నాలుగవ రోజుకు చేరుకున్న ఈ దీక్షలో తుళ్లూరులో రైతులు, రైతు కూలీలు 50 గంటలపాటు నిరాహార దీక్షకు కుర్చున్నారు. ఈ దీక్షను బుధవారంతో ముగించనున్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభించి బుధవారంతో 50 రోజులు కావొస్తున్నందున ఆ రోజు కులవృత్తులు చేస్తూ వినూత్న నిరసన చేపట్టనున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు.

ఇటు రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇంకాస్త పెరుగుతోంది. ఇప్పటికే వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ఏపీ వ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తోంది. అమరావతి రైతులకు తెలంగాణ రైతుల నుంచి కూడా సంఘీభావం లభిస్తోంది. మంగళవారం కూడా మందడం వెలగపూడి, తుళ్లూరు ప్రాంతాల రైతులు రిలే దీక్షల్లో పాల్గొని.. ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాయపూడి, వెలగపూడి, ఎర్రబాలెం, తెనాలి, గుంటూరు కలెక్టరేట్‌ ఎదురు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, కృష్ణాయపాలెం తదితర ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలను కొనసాగించనున్నారు. మహిళలు వంట పాత్రలు కడుగుతూ నిరసన తెలపనున్నారు.

అమరావతి రాజధానికి మద్దతుగా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రైతులు, మహిళలు ఒక్కరోజు నిరాహార దీక్షలు చేశారు. వీరిలో 95 ఏళ్ల కిలారి విమలమ్మ కూడా ఉన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించనున్న చంద్రబాబు.. అక్కడ నిరసనల్లో పాల్గొన్న రైతులను, మహిళలను కలవనున్నారు.

Tags

Next Story