ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న అమరావతి రైతులు.. ప్రాణాలకైనా తెగిస్తామంటూ ప్రకటనలు

ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న అమరావతి రైతులు.. ప్రాణాలకైనా తెగిస్తామంటూ ప్రకటనలు

అమరావతిపై కక్షకట్టినట్టుగా ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని ప్రాంతం రగిలిపోతూనేవుంది. రాజధాని ఉద్యమం 48వ రోజు కూడా ఉధృతంగా కొనసాగింది. రాజధాని కోసం ఎన్నాళ్లైనా పోరాటం చేస్తామని రైతుల నినదించారు. తమను వేదనకు గురి చేసి ప్రభుత్వం ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. అటు రాజధాని ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు.. అమరావతి పరిరక్షణ జేఏసీ ముమ్మర చర్యలు ప్రారంభించింది. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన జేఏసీ నేతలు, రైతుల బృందం.. పలువురు కేంద్రమంత్రులను కలిసింది. వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టింది.

రాజధాని గ్రామాల్లో ఎవర్ని కదిపినా ఉద్వేగానికి లోనవుతున్నారు. తమ భవిష్యత్‌తో ఆటలాడుతున్న సర్కార్‌ తీరుపై మండిపడుతున్నారు. ఇన్నాళ్లు గడపదాటి బయటకు రాని మహిళలు సైతం నిరసన దీక్షల్లో కూర్చుంటున్నారు. పదిమందితో మాట్లాడాలంటేనే సిగ్గుపడేవాళ్లు కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమ డిమాండ్‌లు వినిపిస్తున్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని 48 రోజులుగా నినదిస్తూనేవున్నారు.

మందడం, వెలగపూడిలో మహాధర్నాలతోపాటు 24 గంటల దీక్షలు కూడా ఉధృతంగా సాగాయి. ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన విరమించుకునే వరకూ.. తమ పోరాటం కొనసాగుతుందని రైతులు హెచ్చరించారు. రాజధాని కోసం ఎన్నాళ్లైనా పోరాటం చేస్తామన్నారు రైతులు. 48 రోజులుగా నిద్రాహారాలు లేకుండా చేసి, తమను వేదనకు గురి చేసి ప్రభుత్వం ఏం సాధిస్తుందని ప్రశ్నించారు.

వరుసగా 48 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు అమరావతి రైతులు. దీక్షలు, ధర్నాలతో తమ డిమాండ్‌ను వినిపించారు. ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని ఎండగట్టారు. తుళ్లూరు, మందడం, వెలగపూడితో పాటు పలు గ్రామాల్లో రైతులు 48వ రోజు కూడా పోరాటం కొనసాగించారు. తమ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తాము ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామా అని ప్రశ్నించారు.

అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో జేఏసీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మద్దతు తెలిపారు.

రైతులు, మహిళలు, రైతు కూలీల పోరాటానికి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. ఢిల్లీకి ధీటైన రాజధాని నిర్మిస్తామని చెప్పిన నరేంద్ర మోదీ.. అమరావతి తరలింపు విషయంలో జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి నెట్టెం రఘురాం కోరారు.

అమరావతి పోరాటంలో మరో గుండె అలసిపోయింది. మందడంలో షేక్ జానీ అనే రైతుకూలీ గుండెపోటుతో మరణించాడు. అమరావతి ఉద్యమంలో నిన్నటిదాకా చురుగ్గా పాల్గొన్నారాయన. ప్రభుత్వ వైఖరితో మనోవేదనకు గురైనట్టు జానీ కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదిలావుంటే, ఆదివారం నందిగామలో పర్యటించిన ఎంపీ నందిగం సురేష్ ను టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు అడ్డుకున్నారు. అమరావతికి సపోర్ట్ చేయాలంటూ గులాబీ పూలిచ్చి తమ నిరసన తెలిపారు. అయితే, అమరావతి కోసం అండగా నిలిచిన విద్యార్థులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అమరావతికి మద్దతు తెలిపాలని కోరిన పాపానికి తమపై కేసులు నమోదు చేశారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని విషయంలో కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందన్నారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. త్వరలోనే రాష్ట్ర నాయకత్వం రాజధాని అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందన్నారు. ఓవైపు ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నా.. వైసీపీ సర్కార్‌ పట్టించుకోకపోవడంతో.. ఇక రాజధాని ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేపట్టింది అమరావతి పరిరక్షణ జేఏసీ. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన జేఏసీ నేతలు, రైతుల బృందం.. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసింది. అమరావతి రైతులను ఆదుకునేందుకు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు జేఏసీ నేతలు.

జేఏసీ నేతల విజ్ఞప్తికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపలేదన్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ అమరావతే రాజధానిగా ఉండాలని తీర్మానం చేసిందని గుర్తు చేశారు.

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను రాజధాని రైతులు కలిశారు. రైతులతో పాటు అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు, టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కనకమేడల కూడా పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యారు. రాజధాని మార్పు, తమకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు రైతులు. లోక్ సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాను కూడా కలిశారు అమరావతి రైతులు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నానితో కలిసి స్పీకర్ కు తమ గోడు వినిపించారు. తమకు న్యాయం చేయాలని.. పార్లమెంట్ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా అమరావతి రైతులు విజ్ఞప్తి చేశారు. రాజధాని తరలింపుతో ఎదురయ్యే సమస్యలను వివరించారు.

Tags

Next Story