తెలంగాణ మహాకుంభమేళాకు సర్వం సిద్ధం

తెలంగాణ మహాకుంభమేళాకు సర్వం సిద్ధం

తెలంగాణ మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది. ఫ్రిబవరి 5 నుంచి 8వ తేది వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేల సంఖ్యలో గుడారాలు, దుకాణాలతో మేడారం ప్రాంతం మహా నగరాన్ని తలపిస్తోంది. నెల రోజుల నుంచే భక్తులు లక్షల సంఖ్యలో వన దేవతలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. సోమవారం ఒక్కరోజే రెండు లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఇప్పటికే 40 లక్షల మంది అమ్మలను దర్శించుకోగా.. జాతర నాలుగు రోజుల్లో 60 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లక్షల సంఖ్యలో భక్తులు తరలిస్తున్న నేపథ్యంలో వారికి ఎక్కడా ఆసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

మంగళవారం కన్నెపల్లె నుంచి పూజారులు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కూర్చోబెడతారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకొని పూజారులు మేడారానికి పాదయాత్రగా పయనమవుతారు. బుధవారం నుంచి అసలు ఘట్టం ప్రారంభం కానుంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తోడ్కొని, జంపన్న వాగును దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకొస్తారు. జాతర ఆరంభానికి ఇది ప్రధాన ఘట్టం.

గురువారం సమ్మక్కను చిలుకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. కుంకుమ భరిణె రూపంలో చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని, జేజేలు పలుకుతూ హారతులు ఇస్తారు. సమ్మక దేవత బయలుదేరే ముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు.

భక్తులు తల్లులను దర్శించుకునేందుకు క్యూలైన్లతో పాటు జంపన్న వాగు స్నానఘట్టాల పొడవునా 4 కిలోమీటర్ల మేర జల్లు స్నానాలకు 5 వేల షవర్లు, దుస్తులు మార్చుకునేందుకు 1400 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశారు. 8,400 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. అటు రాజమహేంద్రవరం నుంచి 3,500 మంది, వరంగల్‌ మహానగర పాలక సంస్థ నుంచి 600 మంది పారిశుద్ధ్య కార్మికులు మేడారానికి చేరుకున్నారు.

అటు ట్రాఫిక్‌ నియంత్రణకు 5వేల మంది పోలీసులు పనిచేయనున్నారు. 15 వందల ఎకరాల్లో పార్కింగ్‌కు సిద్ధం చేశారు. డ్రోన్‌, సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నాలుగు కంట్రోల్‌ రూంలు ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు భక్తుల కోసం హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ మేడారం జాతర నిర్వహణకు రూ.75 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

అటు దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

Tags

Next Story