ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను ఎత్తివేయాలి: నిర్భయ కేసులో కేంద్రం వాదన

నిర్భయ కేసులో దోషులు కావాలనే జాప్యం చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేయడానికి ఉద్ధేశ పూర్వకంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. నలుగురు దోషులు భారతదేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని కేంద్రం తరఫు న్యాయవాది తుషార్ మెహ్‌తా పేర్కొన్నారు. నిర్భయ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి దారుణమైన కేసు ల్లోనూ శిక్ష అమలులో జాప్యం జరిగితే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. న్యాయప్రక్రియలో జాప్యం కారణంగానే రేపిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తే ప్రజలు స్వాగతించే పరిస్థితులు వచ్చాయన్నారు.
నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై పటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. దోషులు అన్ని రకాల న్యాయమార్గాలు ఉపయోగించుకోలేదని తెలిపింది. ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు మిగిలిన ముగ్గురికి మరణశిక్ష అమలు చేసే పరిస్థితి లేదని పేర్కొంది. నిబంధనల ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పటియాలా కోర్టు స్టేను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పవన్ గుప్తా అనే దోషి ఇప్పటివరకు క్యురేటివ్ పిటిషన్ వేయలేదని, రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదని గుర్తు చేసింది. కావాలనే ఆలస్యం చేస్తూ ఉరిశిక్షను జాప్యం చేస్తున్నారని తెలిపింది. ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com