అధికార పక్షానికి విపక్షాలు షాక్‌

అధికార పక్షానికి విపక్షాలు షాక్‌

ఏపీలో మూడు రాజధానుల బిల్లును, CRDA రద్దు బిల్లులను మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో.. వివిధ పార్టీల నుంచి సభ్యుల పేర్లు కోరారు ఛైర్మన్ షరీఫ్. ఇప్పటికే టీడీపీ ఐదుగురి పేర్లను పంపగా.. బీజేపీ, పీడీఎఫ్‌ కూడ తమ సభ్యుల పేర్లను పంపాయి. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు బీజేపీ నుంచి మాధవ్, సోము వీర్రాజు.. పీడీఎఫ్‌ నుంచి లక్ష్మణరావు, వెంకటేశ్వర రావు పేర్లను పంపారు.

శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందున ఇక పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు ఎలాంటి అవరోధాలూ ఉండవని భావించిన అధికార పక్షానికి విపక్షాలు షాక్‌ ఇచ్చాయి. ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్న మండలి చైర్మన్‌ ఎం.ఏ.షరీఫ్‌.. సదరు కమిటీల్లో ఉండే సభ్యుల పేర్లు పంపాలని ఆయా పార్టీలకు లేఖలు రాశారు. అయితే సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న నిర్ణయం తప్పని.. పీడీఎఫ్‌, బీజేపీ సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నారని ఇన్నాళ్లూ వైసీపీ వాదించింది. కానీ ఆ రెండూ పార్టీలు ఆయా కమిటీలకు తమ సభ్యుల పేర్లను సూచిస్తూ మండలి ఇన్‌చార్జి కార్యదర్శికి పంపాయి.

మండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ ఇప్పటికే రెండు బిల్లులపై కమిటీలకు తమ సభ్యుల పేర్లను చైర్మన్‌కు సిఫారసు చేసింది. సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై అధ్యయనానికి దీపక్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు, బుద్దా నాగజగదీశ్వరరావు పేర్లను ప్రతిపాదించింది. పాలన వికేంద్రీకరణ బిల్లుపై అధ్యయనానికి అశోక్‌బాబు, లోకేశ్‌, తిప్పేస్వామి, బీటీనాయుడు, సంధ్యారాణి పేర్లను సిఫారసు చేసింది. ఈ కమిటీల్లో వైసీపీ పాల్గొనేది లేదని ఇప్పటికే మండలిలో సభానేతలు, డిప్యూటీసీఎం పిల్లి సుభాశ్‌చంద్రబోస్‌, చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి.. మండలి కార్యదర్శికి లేఖలు రాశారు.

Tags

Next Story