ఒక ఎమ్మెల్యే.. నలుగురు షాడో ఎమ్మెల్యేలు..

ఒక ఎమ్మెల్యే.. నలుగురు షాడో ఎమ్మెల్యేలు..

ఒక ఎమ్మెల్యే.. నలుగురు షాడో ఎమ్మెల్యేలు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రోజా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో నడుస్తున్న సినిమా ఇది. ప్రతి విషయంలో తలదూర్చుతూ తమ మాటే శాసనమయ్యేలా ఆ నలుగురు నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా ఆ నలుగురే కీలకం. వారిని నెగ్లెక్ట్‌ చేశామా.. ఏ పనైనా ఇంచ్‌ కూడా కదలదు. ఆ నలుగురినీ సంప్రదించకపోతే పార్టీకి కూడా దూరం కావాల్సిందే. ప్రతి పనిలోనూ వారే పాత్రధారులు, సూత్రధారులు. చివరికి ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కావాల్సిన అధికారులు కూడా ఆ నలుగురి సమావేశానికి అటెండ్ అవుతూ స్వామి భక్తి చూపిస్తున్నారు.

షాడో ఎమ్మెల్యే అంటే.. ఎవరో ఒకరో లేదా ఇద్దరో ఉంటారు. నగరిలో మాత్రం నాలుగు స్తంభాలాటగా ఉంది పరిస్థితి. చివరికి రిపబ్లిక్ డే రోజున.. ఎమ్మెల్యే రోజా భర్త.. ఆర్కే సెల్వమణి.. నగరి మున్సిపాలిటీలో జాతీయ జెండా ఎగురవేశారు. మేడమ్‌ ఎమ్మెల్యేను తనలో చూసుకోండని జనానికి మెసేజ్‌ ఇచ్చారు సెల్వమణి. ఓ ఎమ్మెల్యే ఆవిష్కరించాల్సిన జాతీయ జెండాను.. ఆమె భర్తగారు ఆవిష్కరించడమేమిటని జనం చెవులు కొరుక్కకుంటున్నారు. ఏ అధికారం వారికి లేకపోయినా.. అధికారులు మాత్రం వాళ్లకు సాగిలా పడుతున్నారు.

రిపబ్లిక్‌ డే రోజున ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి జెండా ఎగురవేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో అందరూ పైకి చెప్పుకోలేకపోయినా.. ముక్కున వేలు వేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో సెల్వమణి దూరపు చుట్టం కూడా.. చక్రం తిప్పుతున్నారు. నగరిలో ఏ పని జరగాలన్నా.. ఎమ్మెల్యేతో పనిలేదు. ఈ షాడో గ్రూప్‌లో ఏ ఒక్కరున్నా.. పని జరిగిపోతుంది. అటు జనం మాత్రం.. మనం ఓటు రోజాకి వేశామా లేక.. షాడో బ్యాచ్‌కి వేశామా అని ప్రశ్నించుకుంటున్నారు.

నగరిలో ఏ సెటిల్‌మెంట్‌ అయినా.. వీరి చూపు నుంచి తప్పించుకోలేదు. చిన్నా పెద్దా పంచాయితీలన్నీ వీళ్ల కనుసన్నుల్లో జరగాల్సిందే. ఇసుకరీచ్‌లు ఎవరికి కేటాయించాలి? సచివాలయ సిబ్బంది నియామకాలు.. లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఏమైనా భయం, భక్తి ఉండే మన అధికారులు.. ప్రతి రోజు షాడో ఎమ్మెల్యేలకు ఓ నమస్కారం చేసి వెళుతుంటారు. అయితే.. ఈ షాడోల రాజరికంపై.. పార్టీ హైకమాండ్‌ దృష్టిపెట్టినట్టు సమాచారం. మరి చర్యలు తీసుకుంటారో.. లేక ఎమ్మెల్యే రోజా వీర విధేయతను చూసి లైట్‌ తీసుకుంటారో వెయిట్‌ చేసి చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story