విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ చేయాలన్న ప్రభుత్వానికి షాక్!
విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ చేయాలన్న ప్రభుత్వానికి రైతులు షాక్ ఇస్తున్నారు. విశాఖ జిల్లా, అనకాపల్లి మండలం, మామిడిపాలెంలో ల్యాండ్ పూలింగ్ చేయడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులకు చుక్కెదురైంది. జీవీఎంసీ పరిధిలో ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా తమ భూములు ఇచ్చేది లేదంటూ మామిడిపాలెం గ్రామస్తులు తేల్చి చెప్పారు. తహసీల్దార్ కారుకు అడ్డుపడి నిరసన తెలిపారు. దీంతో చేసేది లేక అధికారులు వెళ్లిపోయారు.
ఇటు జిల్లా వ్యాప్తంగా ల్యాండ్ పూలింగ్‌ను నిరసిస్తూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. 6 వేల 116 ఎకరాల పూలింగ్‌కు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండడంపై సీపీఎం మండిపడుతోంది. శారదాపీఠానికి వచ్చిన సీఎం జగన్‌కు తన నిరసన తెలియజేయాలనుకున్నారు. కాన్వాయ్ అడ్డుకుని నిరసన తెలపాలని నిర్ణయించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. సీపీఎం, ప్రజారైతు సంఘాల నేతలు స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు. ముందుగా పంచగ్రామాల భూసమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విశాఖలో పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయని ఆరోపించారు టీడీపీ అధినేత. ఆ రోజు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేస్తే తప్పన్న వైసీపీ నేతలు.. విశాఖలో ఇప్పుడెందుకు భూసమీకరణ చేపట్టారని విమర్శించారు. విశాఖలో జరిగే భూ కుంభకోణాలు త్వరలో బయటకు వస్తాయిన్నారు చంద్రబాబు.
విశాఖలో భూసమీకరణ వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు టీడీపీ నేత పట్టాభి. వైసీపీ 420 గ్యాంగ్‌కి దోచిపెట్టడానికి విశాఖలో 5వేల ఎకరాలు సిద్ధం చేశారని అన్నారు. విశాఖపై వైసీపీ నేతలది కపట ప్రేమ అని.. భూముల మీద ప్రేమతోనే రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు.
భూసమీకరణ పేరుతో 2400 ఎకరాల భూ కుంభకోణానికి తెర తీశారని పట్టాభి ఆరోపించారు. విజయ సాయి, బొత్స సహా వైసీపీ నాయకులందరు విశాఖలో భూములు కొట్టేసే ప్లాన్‌కు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. మీరిచ్చిన జీవోల ద్వారానే అడ్డంగా దొరికిపోయారన్నారు పట్టాభి.
ఇటు శ్రీకాకుళంలోనూ ఇదే పరిస్థితి.. వైఎస్‌ఆర్ నవశకం పేరుతో దళితుల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమంటూ భారీ ర్యాలీ చేపట్టారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో 40 ఏళ్లుగా దళితుల ఆదీనంలో ఉన్న భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని ఉద్యమాన్ని ఇంకాస్త ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఛలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు. ఈ ర్యాలీలో మహిళలు సైతం భారీగా పాల్గొని నిరసనలు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com