ఆమె గానామృతానికి డబ్బుల కట్టలతో సన్మానం

సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారులకు సన్మానం చేయడం సర్వసాధారణం. కొన్ని చోట్ల సింగర్స్‌పై నోట్ల వర్షం కురిపిస్తారు. గుజరాత్‌లో అలాంటిదే జరిగింది. సంగీత విభావరిలో పాట పాడుతున్న జానపద గాయనిపై ప్రజలు నోట్ల వర్షం కురిపించారు. ఆమె గానామృతానికి డబ్బుల కట్టలతో సన్మానించారు. ఆమెపై నోట్లను చల్లుతూ అభిమానం చాటుకున్నారు. నవ్‌సారీ జిల్లా వన్జనా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భజన్ సంధ్య అనే ట్రస్ట్ స్థానికంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. జానపద గాయని గీతా రబారీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆమె స్వరానికి ప్రజలు మైమరిచిపోయారు. ఆ మైకంలో గీతా రబారీపై నోట్ల వర్షం కురిపించారు. 10 రూపాయలు మొదలుకొని 2 వేల రూపాయల వరకు నోట్లు వెదజల్లారు. అమెరికన్ డాలర్లను కూడా ఆమెపై చల్లారు. ఇక ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత ఆ నోట్లను లెక్కిస్తే దాదాపు 8 లక్షల వరకు వచ్చినట్లు తేలింది. ఆ మొత్తాన్ని పిల్లల చదువు, ఉచిత ఆహార కేంద్రాన్ని నడిపించడం, గిరిజన యువతుల పెళ్లికి ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com