సమ్మక్క, సారలమ్మ జాతర

సమ్మక్క, సారలమ్మ జాతర

ములుగు జిల్లా మేడారంలో ప్రతి రెండేళ్ళకోసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. తాడ్వాయి మండలంలోని కీకారణ్యం గుండా సాగే దారిలో వున్న మేడారంలో ప్రతి రెండేళ్లకు ఒకేసారి మాఘశుద్ధ్య పౌర్ణమి రోజు ఈ జనజాతర ప్రారంభం అవుతుంది. బుధవారం నుంచి శనివారం జరిగే ఈ జనజాతరకు కోటి మంది వస్తారని అంచనా. పూర్తిగా కోయ గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ఏ విధమైన విగ్రహాలు గాని, ప్రతిరూపాలుగాని వుండవు. మేడారం జాతర కాశీ పుష్కర మేళాలకు, పూరీ జగన్నాధ రథయాత్రకు, తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు భిన్నమైన రీతిలో జరుగుతుంది. ఈ జాతరకు వచ్చే భక్తులు పసుపు, కుంకుమ, బెల్లంతో అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. తెలంగాణా కుంభమేళాగా పిలిచే ఈ మేడారం జాతరకు ఏపీ , ఛత్తీస్ గడ్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలోని గిరిజనులు, గిరిజనేతరులే కాకుండా విదేశీ భక్తులు కూడా వస్తారు.

మొదటి రోజు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజులును గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టిస్తారు. మరుసటి రోజు గురువారం సమ్మక్కను చిలుకల గుట్ట నుంచి తీసుకొస్తారు.. జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. శుక్రవారం సమ్మక్క, సారలమ్మలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగుస్తుంది.

జాతరకు ప్రభుత్వం 75 కోట్లను కేటాయించింది. అదనపు స్నాన ఘట్టాల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుధ్య కార్యక్రమాలు, నిరంతర విద్యుత్తు సరఫరా, వైద్య సదుపాయాల కల్పన, విస్తృత బందోబస్తు, రవాణా సౌకర్యాలు తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు. రెవిన్యూ, రోడ్లు, భవనాల శాఖతోపాటు నీటిపారుదల, పోలీస్, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, దేవాదాయ, గిరిజన శాఖలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఈసారి జాతరను ప్లాస్టిక్‌రహిత జాతరగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ పర్యటక శాఖ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించింది. ట్రాఫిక్‌ నియంత్రణకు 5వేల మంది పోలీసులు పనిచేస్తున్నారు. 15 వందల ఎకరాల్లో పార్కింగ్‌కు సిద్ధం చేశారు.. డ్రోన్‌, సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నాలుగు కంట్రోల్‌ రూంలు ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు దక్షిణ మధ్య రైల్వే కూడా 20 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story