సమ్మక్క, సారలమ్మల చరిత్ర

సమ్మక్క, సారలమ్మల చరిత్ర

సమ్మక్క, సారలమ్మల మహిమ, గొప్పతనం, వీరత్వం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవతలుగా పూజలందుకుంటున్న ఈ కోయ వీరులు సామన్య మనుషులు. అయితే ప్రజల కోసం బతకాలి. ప్రజల కోసం చావాలి అనే వారి విధానమే వారిని దేవుళ్ళను చేసింది. వీరత్వం దైవత్వంగా మారింది.

దాదాపు వెయ్యేళ్ల క్రితం ప్రస్తుత మేడారం ప్రాంతంలో మేడరాజులు కాకతీయులకు సామంతులుగా రాజ్యం చేస్తుండే వారు. మేడరాజ్యానికి సామంత రాజు పగిడిద్దరాజు. పగిడిద్దరాజు భార్య సమ్మక్క. వారి ముగ్గురి సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. సారలమ్మ భర్త గోవిందరాజు. ఓసారి నాలుగేళ్ల పాటు తీవ్ర కరువు కాటకాలు రావడంతో మేడరాజ్యంలో ప్రజలు పన్నులు కట్టలేకపోయారు. దీంతో సామంతులు కాకతీయులకు కప్పం చెల్లించలేదు. కప్పం చెల్లించడం లేదనే సాకుతో కాకతీయులు మేడరాజులపై యుద్ధానికి దిగారు. పగిడిద్దరాజు జంపన్న, నాగులమ్మ, సారలమ్మ, గోవిందరాజు కాకతీయులపై వీరోచిత పోరాటం చేశారు. అయినా శక్తివంతమైన కాకతీయుల సైన్యాన్ని ఎదుర్కోలేక వారంతా యుద్ధభూమిలో నేలకొరిగారు. కాకతీయ సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టం లేక జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే వాగు ఇప్పుడు జంపన్న వాగయ్యింది. భక్తులు పుణ్యస్నానాలు చేసే పవిత్ర స్థానమైంది.

కుటుంబ సభ్యులంతా కాకతీయులతో జరిగిన యుద్ధంలో నేలకొరిగారని తెలుసుకున్న సమ్మక్క యుద్ధ రంగంలోకి దూకి పరాశక్తి అవతారమెత్తింది. కాకతీయుల సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఈటలు, బల్లాలతో చీల్చి చెండాడింది. ఇక ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైన్యం ఆమెను వెన్నుపోటు పొడిచింది. అప్పుడామే యుద్ధ భూమి నుంచి వైదొలగి మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టవైపు వెళ్లి అదృశ్యమైంది. అక్కడి

నెమలిమినార చెట్టు వద్ద సమ్మక్క కుంకుమ భరణి మాత్రమే దొరికింది. ఎంత వెతికినా సమ్మక్క దొరకలేదు. ఆ కుంకుమ భరిణనే సమ్మక్క గుర్తుగా తెచ్చి దానికి పూజలు చేయడం అప్పటి నుంచి వస్తున్న ఆనవాయితి.

జంపన్న వాగులో స్నానాలు, తలనీలాల సమర్పణం, ఎదురు కోళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించడం, లక్ష్మి దేవర వేశాలు, శివసత్తుల పూనకాలు, వడిబియ్యం సమర్పణ, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, మండ మెలిగే ఉత్సవం, కోయదొరల భవిష్యవాణి లాంటి దృశ్యాలు జాతరను కోలాహలంగా మార్చాయి. వేద మంత్రోచ్ఛారణలు లేకుండా, విగ్రహారాధన చేయకుండా, ఏ మతం ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారులు, కోయ గిరిజన పద్ధతి జాతరను జరిపిస్తారు.

కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే ఈ జాతర పరిమితం కాదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులయ్యారు. పోరాటం చేసిన మేడరాజులు మాత్రం దేవుళ్ళు దేవతలయ్యారు.

Read MoreRead Less
Next Story