- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- సీఎం జగన్‌ను కలిసింది రాజధానికి...
సీఎం జగన్‌ను కలిసింది రాజధానికి భూములు ఇచ్చినవాళ్లు కాదు : అమరావతి రైతులు

అదే దీక్ష.. అదే దక్షత! ఒకటి కాదు..రెండు కాదు.. అమరావతి కోసం రైతులు రోడ్డెక్కి 50 రోజులు పూర్తయ్యాయి. మూడు రాజధానులపై అసెంబ్లీలో జగన్ ప్రకటన చేసిన మరుసటి రోజే.. 29 గ్రామాలు భగ్గుమన్నాయి. చిన్నాపెద్దా , ముసలి ముతక, అన్న తేడా లేకుండా ప్రజలంతా రోడ్డెక్కారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాజధాని కోసం ఉద్యమిస్తున్నారు.
పండుగలు కూడా జరుపుకోకుండా 50 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు రాజధాని రైతులు. దీక్షలు, ధర్నాలు, మహా ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తించారు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు 50వ రోజూ కొనసాగాయి. వెలగపూడిలో రిలే దీక్షలు 50వ రోజుకి చేరాయి. రాయపూడి, మల్కాపురం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, పెదపరిమి,తాడికొండలోనూ నిరసనలు తీవ్రమయ్యాయి.
ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో 50వ రోజు జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసనలు చేపట్టారు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వారితో కలిపి ఆందోళనలు నిర్వహించారు.. ఇస్త్రీ చేస్తూ, చెప్పులు కుడుతూ, గడ్డం గీస్తూ, బట్టలు ఉతుకుతూ..నిరసనలు తెలియజేశారు. కొందరు మహిళలు దీక్షా శిబిరాల్లోనే నూలు వడికారు..
మంగళవారం ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి సీఎం జగన్‌ను కలిసింది రాజధానికి భూములు ఇచ్చినవాళ్లు కాదని రైతులు ఆరోపించారు. కేవలం రైతుల్లో విభజన తెచ్చేందుకే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు... 50 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా తమ దగ్గరకు రాని స్థానిక ఎమ్మెల్యేలు.. తన అనుచరులను సీఎం దగ్గరకు తీసుకెళ్లి.. మాయమాటలు చెప్పించారని విమర్శించారు.
రాజధాని తరలింపు నిర్ణయం రైతుల ఉసురు తీస్తోంది. పోరాటంలో అన్నదాతల గుండెలు అలసిపోతున్నాయి. అమరావతిలో మరో ఇద్దరు రైతులు మృతి చెందారు. మంగళవారం తుళ్లూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న జమ్ముల హనుమంతరావు గుండెపోటుతో మరణించారు. అటు నిడమర్రు గ్రామంలో 63 ఏళ్ల తాడి బోయిన పుల్లయ్య యాదవ్ అనే రైతు కూడా గుండెపోటుతో చనిపోయారు. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో ఇప్పటి
వరకు దాదాపు 40 మంది రైతులు అసువులు బాశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com